కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పదమైన బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టింది. దానికి ఆమోదముద్ర పడితే, ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, మంత్రులు ఎవరైనా సరే అవినీతి కేసులలో 30 రోజులకు మించి జైల్లో ఉంటే ఆటోమేటిక్‌గా వారి పదవులు ఊడిపోతాయి. ఒక తీవ్రమైన నేరారోపణతో కనీసం 5 ఏళ్ళు జైలు శిక్షపడే నేరంలో అరెస్ట్ అయినవారికి ఇది వర్తిస్తుంది.
అయితే దీనిని ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. ఆ తర్వాత దీనిపై ఉభయ సభలలో చర్చించి, లోటుపాట్లు ఉంటే సవరించి ఆమోదిస్తారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, “అవినీతి కేసులో ఓ ప్రభుత్వోద్యోగి 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ అవినీతికి పాల్పడిన మంత్రులకు ఎందుకు ఈ నియమం వర్తించదు?అవినీతికి పాల్పడితే ప్రధానమంత్రి అయిన గద్దె దిగాల్సిందే.
ఇటీవల ఓ ముఖ్యమంత్రి (మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్) జైల్లో నుంచే పరిపాలన చేశారు. జైల్లోనే ఫైల్స్ సంతకాలు చేసేవారు. ఇకపై ఈవిదంగా జైలు పాలన సాధ్యం కాదు. 30 రోజులు దాటితే పదవి కోల్పోక తప్పదు,” అని ప్రధాని మోడీ అన్నారు.
ఇండియా కూటమిలో చాలా మంది జైల్లో ఉన్నారు లేకుంటే బెయిల్‌పై బయటున్నారు. కనుకనే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. కానీ అవినీతికి పాల్పడితే ఎవరూ తప్పించుకోలేరనే బలమైన సందేశం ఇవ్వడం చాలా అవసరం. ఈ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని భావిస్తున్నాను,” అని ప్రధాని మోడీ అన్నారు.
కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులపై సీబీఐ, ఈడీ, ఐటిల చేత తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించి ఆయా ప్రభుత్వాలను దొడ్డి దోవలో కబ్జా చేసేందుకే మోడీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువస్తోందని కాంగ్రెస్ మిత్ర పక్షాలు వాదిస్తున్నాయి.






