ఇటీవల లోక్ సభలో బీజేపీ ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లులపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 30 రోజుల పాటు జైలు శిక్ష విధించబడితే ప్రధాన మంత్రి నుంచి మంత్రి వరకు ఎవరైనా వారి పదవి నుండి తొలగించబడతారు అనేలా కేంద్రహోం మంత్రి అమిత్ షా ఈ బిల్లు ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
లోక్ సభ లో ప్రవేశ పెట్టిన ఈ బిల్లును తదుపరి సమీక్ష కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఓటు వేసింది ప్రభుత్వం. అయితే ఈ బిల్లు పై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు.
ఈ బిల్లు భారత సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచే లక్ష్యంతో తీసుకున్న దుశ్చర్య అంటూ అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ప్రతిపక్ష నాయకాయలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇప్పటికే ఈడీ, సిబిఐ వంటి సంస్థలను సైతం దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
అలాగే వారి ఆరోపణలకు బలం చేకూరేలా బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పినా, మోడీ షా లను విమర్శిస్తూ రాజకీయం నడిపిన రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయాయి, అలాగే పార్టీ ముఖ్య నాయకులను నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జైళ్లకు వెళ్లారు, ఆయా పార్టీలు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు షా, అవినీతి పై యుద్ధం అంటూ ఈ రకమైన బిల్లును ప్రవేశపెట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చెయ్యాలని భావిస్తున్నారా.? తద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో అనిచ్చితి ఏర్పడేలా చెయ్యాలనుకుంటున్నారా అంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి.
ఇటువంటి బిల్లును రాజకీయ దుర్వినియోగానికి ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విమర్శకులు. 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఇక పదవి నుంచి తొలగించడమే అంటే అది అధికారంలో ఉన్నవారికి పెద్ద విషయమేమి కాకపోవచ్చు. సమకాలీన రాజకీయాలలో కక్ష్య రాజకీయాలు, వేధింపు చర్యలు సర్వసాధారణంగా మారిపోయాయి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వం అవినీతి అంటూ కొత్త ప్రభుత్వాలు ఆయా నేతల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైళ్లకు పంపడం రాజకీయ పార్టీల దినచర్యలో భాగమైపోయాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ రకమైన అధికారం ఉంటే అది జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష పార్టీలకు సైతం పక్కలో బల్లెం వంటిదే.
ఈ బిల్లు ” దోషిగా నిరూపించే వరకు నిర్దోషే” అనే ప్రాథమిక సూత్రాన్ని సైతం ఉల్లంగిస్తుంది అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మన దేశంలో ఒక రాజకీయ నాయకుడి మీద వేసిన కేసుల విచారణ దశాబ్దాల పాటు న్యాయస్థానాల చుట్టూ విచారణల పేరుతో, వాయిదాల రూపంలో తిరుగుతూనే ఉంటాయి.
అటువంటి సందర్భంలో సదరు నాయకుడి రాజకీయ జీవితాన్ని 30 రోజులలో నిర్దేశించడం అంటే అది రాజ్యాంగ బద్దమవుతుందా.? వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక్కో నాయకుడికి ఆయన జీవితకాలం పట్టే సందర్భాలు కోకొల్లలుగ ఉన్నాయి.
ఉదాహరణకు ఏపీ విపక్ష నేత వైస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులు పదుల సంఖ్యలో కోర్టులలో దశాబ్దాల నుంచి మగ్గుతున్నాయి. అయితే జగన్ జైలు జీవితం మాత్రం 16 నెలలకే ముగిసినప్పటికి ఇప్పటికీ ఆయన మీద ఉన్న కేసులు వాయిదాలతో ప్రజలలో కూడా విసుగు తెప్పిస్తున్నాయి.
అటువంటి సందర్భాలను చూస్తున్న భారతదేశ రాజకీయం ఇప్పుడు ఈ బిల్లు తో దేశ చరిత్రను మార్చబోతుందా.? బీజేపీ ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లగలుగుతుందా.? అదే జరిగితే దేశంలో కాషాయ రాజ్యాంగం అమలు అవ్వడం ఖాయం అనే వారి సంఖ్యే ఎక్కువగా అంటుంది, ఆ అభిప్రాయాన్ని బలపరిచే చేతులే అధికమవుతాయి.
అయితే షా ప్రవేశ పెట్టిన ఈ బిల్లు అటు ప్రతిపక్ష పార్టీల నేతలకే కాదు ఇటు మిత్రపక్ష పార్టీల నాయకులకు కూడా పీక మీద కత్తె అవుతుంది. ఎన్డీయే లో భాగమైన టీడీపీ పార్టీ అధినేత బాబు సైతం 60 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపినవారే. ఇది టీడీపీ కి కూడా కొరకరాని కొయ్యగానే మారుతుంది.
విచిత్రం ఏమిటంటే లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం 2010 సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో సుమారు 96 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించినవారే. ఆ సమయంలో గుజరాత్ హోమ్ మంత్రి గా పని చేస్తున్న షా తన పదవికి రాజీనామా చెయ్యక తప్పలేదు.
అయితే బీజేపీ ఆశిస్తున్నట్టు ఈ బిల్లు చట్ట సభలలో ఆమోదించబడడం అంత సులభమైన పని కాదనే చెప్పాలి. ఈ బిల్లు ఆమోదానికి 130 వ రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సభలో మూడింట రెండు వంతుల ఆమోదం మరియు సగం రాష్ట్ర అసెంబ్లీల మద్దతు అత్యవసరం.






