ఇండియా అంటే భారత్ కదా?మరి ఇదేం పిచ్చి ప్రశ్న అనుకోవచ్చు. కానీ నిజంగానే లోక్‌సభ ఎన్నికలలో ఇండియా-భారత్ పోటీ పడబోతున్నాయి.
నిన్న బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ మిత్రపక్షాల సమావేశంలో 26 పార్టీలు కలిసి తమ కూటమికి ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూసివ్ అలయెన్స్) అని పేరు పెట్టుకొన్నాయి. దేశంలో బలహీనపడుతున్న ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, దేశ సమగ్రతను కాపాడుకొనేందుకు వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని ఇండియాలో భాగస్వామ్య పార్టీలు నిర్ణయించాయి.
యాదృచ్ఛికంగా నిన్నే బిజెపి కూడా తన మిత్రప్రక్షాలు (ఎన్డీయే)తో ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మిత్రపక్ష నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘బిజెపి అంటే భారత్’ అన్నారు. భారత్ కోసమే బిజెపి మిత్రపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రాలలో పరస్పరం కీచులాడుకొనే ఆ పార్టీలు, కలిసికట్టుగా ఎలా పనిచేయగలవని మోడీ ప్రశ్నించారు.
యూపీయే హయాంలో భారత్ అన్ని రంగాలలో వెనకబడిపోయి ప్రపంచదేశాల దృష్టిలో నవ్వులపాలైందని, కానీ తమ ఎన్డీయే హయాంలో భారత్ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
కేవలం పదవులు, అధికారం కోసమే ప్రతిపక్షాలన్నీ ‘ఇండియా ‘ పేరు పెట్టుకొని ప్రజల ముందుకు రాబోతున్నాయని, కానీ దేశ భద్రత, దేశాభివృద్ధి కోసమే పనిచేసేందుకే ఎన్డీయే ఏర్పడిందని అన్నారు. కనుక ఇండియా పేరు పెట్టుకొని లోక్‌సభ ఎన్నికలకు వచ్చినంత మాత్రన్న ఉజ్వల భారత్ కోసం శ్రమిస్తున్న ఎన్డీయేని ఓడించలేవని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో భారత్-ఇండియా మద్య పోటీ జరుగబోతోందన్న మాట. మరి ఆ యుద్ధంలో ఇండియా గెలుస్తుందో… భారత్ గెలుస్తుందో చూడాలి.



