ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రతిపక్ష నేతలపై, కార్యకర్తలపై ఏదో ఓ కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు తిప్పడం, వీలైతే జ్యూడీషియల్ రిమాండ్ మీద కొన్నాళ్ళైనా జైలుకి పంపుతుండటం సర్వసాధారణమైపోయింది. పోలీసులు అర్దరాత్రి ప్రతిపక్ష నేతల ఇళ్ళను చుట్టుముట్టి గోడలు దూకి, తలుపులు పగుల గొట్టి అరెస్టులు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు, దీక్షలు చేస్తున్నవారిపై కేసులు సరేసరి. ఈ నాలుగేళ్ళలో ఎన్ని కేసులు నమోదు చేశారో ఈ నాలుగు నెలల్లోనే అన్ని కేసులు నమోదు చేసి ఉండవచ్చు.
చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసన తెలియజేస్తూ నెల్లూరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల అధ్వర్యంలో బుధవారం సాయంత్రం నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ జంక్షన్ నుంచి గాంధీ విగ్రహం వరకు ‘బాపుకి చెపుదాం’ పేరుతో జరిగిన ర్యాలీలో రాజీకీయాలకు అతీతంగా వేలాదిమంది సామాన్య ప్రజలు, ముఖ్యంగా భారీ సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు.
ఈ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు తెలుసుకొని ముందు రోజు నుంచే ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించి, బ్యారీకేడ్లు అడ్డుపెట్టి, గృహ నిర్బంధాలు చేసి, ఆంక్షలు విధించి అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ ర్యాలీ విజయవంతమైంది.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టిడిపి సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు.
ర్యాలీని జరుగకుండా అడ్డుకొనేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ విజయవంతం అయినందున అనుమతిలేకుండా ర్యాలీ నిర్వహించినందుకు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో సహా మొత్తం 16 మంది పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే ఈ దీక్షలు, ర్యాలీలు ఒక్క నెల్లూరుకే పరిమితం కాదు. చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో వేలాదిమంది టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొంటూనే ఉన్నారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని స్పష్టమైంది. కనుక పోలీసులు ఇంకా ఎంతమందిపై కేసులు నమోదు చేయగలరు? ఎంతమందిని అరెస్ట్ చేయగలరు?ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరినీ అరెస్ట్ చేయక తప్పదేమో?సాధ్యమా కాదో తెలీదు కానీ వైసీపి ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తుంటే, ప్రతిపక్షాలు కాదు… ప్రజలే వైసీపిని ఓడించి ఇంటికి పంపించడం ఖాయం. ఇంతవరకు పోలీసులతో పరిపాలన చేయాలనుకొన్న ఏ ప్రభుత్వమూ నిలబడలేదనే విషయం గ్రహిస్తే మంచిది.



