పాత నోట్లను రద్దు చేస్తూ కొత్తగా విడుదల చేసిన 500, 2000 రూపాయల నోట్లపై ప్రజలు ఎలాంటి రాతలు రాయకూడదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఒకవేళ అలా రాస్తే గనుక, అవి చెల్లని నోట్లుగా మారిపోతాయని, వాటికి విలువుండదని చెప్పడంతో… తెలియక ఎవరైనా పొరపాటుగా రాసిన రాతల వలన అవి ఎందుకు పనికి రాని కాగితాలుగా మారిపోయాయి. రోజువారీ వాడుకలో కూడా ప్రజలు వీటిని చలామణి చేయడం లేదు. కానీ, ఇలాంటి వాటిపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా వివరణ ఇచ్చింది.
1999 నాటి “క్లీన్ నోట్” పాలసీ నిబంధనల ప్రకారం బ్యాంకులు నడుచుకోవాల్సిందేనని… చిరిగిన, గీతలు, రాతలున్న నోట్లను తీసుకోకుంటే, సదరు బ్యాంకులకు 10 వేల వరకూ జరిమానా విధిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. పాడైన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని తెలుపుతూ, కస్టమర్లను ఇబ్బందులు పెట్టవద్దని బ్యాంకులకు సూచించింది. అయితే రోజుకు 20 నోట్లు లేదా 5 వేలకు మించి నోట్లను మార్చేందుకు ఎవరైనా వస్తే, సర్వీస్ చార్జీలను వసూలు చేసుకునే అధికారం బ్యాంకులకు ఉందని పేర్కొంది.



