ఇప్పటికే రద్దయిన నోట్లతో సతమతమవుతున్నసామాన్య ప్రజానీకానికి ఒక తెలియని నిబంధన వెలుగులోకి వచ్చింది. కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సమయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. అయితే దీనిపై మీడియా వర్గాలు పెద్దగా ఫోకస్ చేయకపోవడంతో సామాన్య ప్రజల్లోకి ఈ కొత్త రూల్ వెళ్ళలేదు. అయితే ఈ విషయం గమనించిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మరికొన్ని బ్యాంకులు తమ బ్రాంచ్ ల ముందు ఆర్బీఐ రూల్ ను వివరిస్తూ హోర్డింగ్ లు పెడుతున్నారు.
నోట్లపై తమకు ఇష్టం వచ్చిన పేర్లు గానీ, డినామినేషన్లు గానీ, ఇంకా ఏ ఇతర సమాచారమైనా గానీ రాయడం ఇప్పటివరకు ప్రజలకు అలవాటైన విషయం. ఇటీవల వచ్చిన 2000 రూపాయల కొత్త నోటుపై ఓ వ్యక్తి కనిపించడం లేదన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక నుండి ఎలాంటి రాతలు ఈ కొత్త నోట్లపై కనిపించినా… అవి కూడా చెల్లుబాటు కాని నోట్ల క్రిందనే పరిగణించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన సరికొత్త నిబంధన ఇది.
అవును… నిజమే… నోట్లపై ఖాళీగా ఉన్న స్థానంలో ఒక్కొక్కరు తమ ప్రేమకు గుర్తుగా రకరకాల సింబల్స్ వేసుకుంటుంటారు. ఒకవేళ అలా వేయాలని భావిస్తే… ఆ నోటు మీ దగ్గరే ఉంచుకోవాల్సి ఉంటుంది తప్ప, ఆ నోటుకు విలువ ఉండదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. అది, ఇది అనే కాదు, నోట్లపై ఏది రాయడానికి వీలులేని రూల్ ఇది. ఆర్బీఐ ఎలా ముద్రించి ఇచ్చిందో, సదరు నోట్లను కూడా అలాగే వినియోగించుకోవాలి తప్ప, తమకు ఇష్టం వచ్చింది రాస్తాము అంటే, తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.



