టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తూ పంటనష్టపోయిన రైతులను పరామర్శించి ధాన్యం కొనుగోలు, నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరగవరంలో ఈరోజు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
ఇరగవరంలో రైతులు అకాల వర్షాలకు దెబ్బ తిన్న వరి పంటను రోడ్డు పక్కన ఆరబెట్టుకొంటే, సుమారు 10-15 మంది పోలీసులు వచ్చి వారే స్వయంగా ట్రాక్టర్లలోకి ధాన్యం లోడ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. వారిలో కొందరు యూనిఫారం కూడా ధరించకుండా అక్కడికి వచ్చారు.
ఈ విషయం తెలుసుకొన్న టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడకు చేరుకొని పోలీసులను అడ్డుకొన్నారు. రైతులు తడిసిన వరి పంటను చంద్రబాబు నాయుడుకి చూపించేందుకు రోడ్డు పక్కన పరిచి ఆరబెట్టుకొంటే, దానిని మీరు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తరలిస్తున్నారని నిమ్మల గట్టిగా నిలదీశారు. ప్రదాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చినందున రైతులు తమ దెబ్బ తిన్న పంటలను ఆయనకు చూపించాలనుకొంటే మద్యలో మీరేందుకు అడ్డుకొంటున్నారని నిలదీశారు. వారు రైతులే కానీ ఉగ్రవాదులో గంజాయి వ్యాపారులో కారు కదా? మరి వారిని ఎందుకు అదుపులో తీసుకొంటున్నారు? వారు ఏం నేరం చేశారు?
అసలు రైతుల సెల్ ఫోన్లు ఎందుకు తీసుకొంటున్నారు? రైతులు తాము పండించిన వరి పంటనే చంద్రబాబు నాయుడుకి చూపించాలను కొంటున్నారు తప్ప గంజాయి లేదా మత్తుమందులు కాదు కదా?మరెందుకు వారిని అడ్డుకొంటున్నారు? అయినా యూనిఫారం, పోలీస్ బ్యాడ్జ్ ధరించకుండా వచ్చిన మీరందరూ నిజంగానే పోలీసులేనా లేక వైసీపీ కార్యకర్తలా? మీరు నిజంగా పోలీసులైతే మీ బ్యాడ్జిలు చూపించండి…” అంటూ నిమ్మల రామానాయుడు వారిని గట్టిగా నిలదీయడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. రైతుల సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేవరకు పోలీసులను అక్కడి నుంచి కదలనీయలేదు. దాంతో పోలీసులు సెల్ ఫోన్లు అప్పగించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వం ఏనాడూ ఈవిదంగా చేయలేదు. ఆయనను అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో జగన్ స్వేచ్ఛగా అన్ని వర్గాల ప్రజలను కలిసి మాట్లాడుతూ ముందుకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంటనష్టపోయిన రైతులను పరామర్శించడానికి వస్తే, రైతులు ఆయనను కలవకుండా పోలీసులు ఈవిదంగా వ్యవహరిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమే కదా?
అయినా విశాఖలో ఋషికొండకు గుండు కొట్టేసి దానిని పరదాలు కప్పి దాచేయాలనే గొప్ప ఆలోచన చేసిన వైసీపీ నేతలకి, పంటనష్టపోయిన రైతులను, వారి పంటలను చంద్రబాబు నాయుడుకి కనబడకుండా దాచేయాలనే ఆలోచన చేయడం విచిత్రమేమీ కాదుగా?



