2012, డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత అమానుషంగా జరిగిన నిర్భయ ఘటనలో, దోషుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో బాధితురాలిపై కదులుతున్న బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు, ఆమె శరీరంలోకి ఇనుప రాడ్ ను చొప్పించి లోపలి అవయవాలను బయటకు లాగినట్లు పోలీసులు కోర్టుకు నివేదించగా, నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు కూడా సదరు తీర్పును సమర్ధించింది.
ఈ క్రమంలో బాధితురాలి శరీరంలోకి నిందితులు ఇనుప రాడ్ ను చొప్పించారన్న వాదనపై నిందితుల తరఫు న్యాయవాది గురువారం నాడు ఓ సంచలన ప్రకటన చేశారు. నిర్భయ ఘటనలో ‘ఇనుప రాడ్’ థియరీని నిరూపించిన వారికి తాను 10 లక్షల బహుమతిని అందజేస్తానని ప్రకటించారు. బాధితురాలు గాని, ఆమె స్నేహితుడు గాని ఇనుప్ రాడ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పిన లాయర్… పోలీసులే కల్పిత కథనాలతో ‘ఇనుప రాడ్’ థియరీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
సామూహిక అత్యాచారం తర్వాత ఆసుపత్రిలో పూర్తి మతి స్థిమితంతోనే బాధితురాలు వాంగ్మూలమిచ్చిందని పేర్కొన్న న్యాయవాది శర్మ, బాధితురాలి వాంగ్మూలంలో ఇనుప రాడ్ ప్రస్తావనే లేకున్నా… పోలీసులు ఈ వాదనను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. నిర్భయ నిందుతుల్లోని ముఖేశ్, పవన్ ల తరఫున వాదనలు వినిపిస్తున్న శర్మ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.



