Nirmala_Sitharaman_Union-_Budget_2023-24

మరో 5 రోజులలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. కనుక బడ్జెట్‌కు ముందు ఆనవాయితీ ప్రకారం ఆమె నిన్న నార్త్ బ్లాక్‌లో ‘హల్వా తయారీ వేడుకలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించాలని సిఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరారు. మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో నిర్మలమ్మ వండిన బడ్జెట్‌ హల్వాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ ముద్ద ఎక్కువే పెట్టే అవకాశం కనిపిస్తోంది.

కానీ ఎన్డీయేలో టిడిపి మాత్రమే కాదు ఇంకా చాలా ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వాటి మద్దతు కూడా మోడీ ప్రభుత్వానికి కీలకమే. కనుక ఆయా రాష్ట్రాలకు కూడా బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు చేయక తప్పదు. కనుక కేంద్ర బడ్జెట్‌పై మరీ ఎక్కువగా ఆశ పెట్టుకుంటే నిరాశ తప్పదు.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

అయితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఇదివరకే హామీ ఇచ్చారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అవుతుంది. ఈ రెంటికీ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారు?

ఒకవేళ బడ్జెట్‌ లెక్కల సర్దుబాట్ల కోసం మొక్కుబడి కేటాయింపులు చేస్తే ఆ తర్వాత కేంద్రం నుంచి సిఎం చంద్రబాబు నాయుడు ఎంత తెచ్చుకోగలరు? కేంద్రం ఏవిదంగా ఆయనకు సాయపడుతుంది? అనేది ముఖ్యం.

Also Read – నేను భారతీయురాలినే అంటున్న ప్రభాస్ హీరోయిన్.

జగన్‌ నిర్వాకం వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వాటి నుంచి బయటపడేందుకు ఏపీకి నామమాత్రపు వడ్డీతో దీర్గకాలిక రుణం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరిన్నట్లు తెలుస్తోంది. కానీ వాటికి బడ్జెట్‌లో కేటాయింపు సాధ్యపడదు. కనుక కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి ఏపీకి ఎంత అప్పు ఇప్పిస్తుంది? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

భోగాపురంతో సహా రాష్ట్రంలో మరో రెండు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సంగతి మన రామ్మోహన్నాయుడు చూసుకోగలరు. కనుక వాటి గురించి దిగులు అవసరం లేదు. పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను రప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్‌ సరిపోతుంది.

కానీ ఏపీలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు, అంతర్జాతీయ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చేందుకు కేంద్రం తోడ్పాటు చాలా అవసరం. ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ చేప్పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసింది కనుక నిర్మలమ్మ బడ్జెట్‌లో వాటికి ఎంత కేటాయిస్తారో చూడాలి.




ఎన్నికలలో మూడు పార్టీలు రాష్ట్రాభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాయి. చేసి చూపిస్తేనే ప్రజలు మళ్ళీ జగన్‌ వైపు చూడకుండా ఉంటారు. కనుక మూడు పార్టీలు ఈ 5 ఏళ్లలో ఏపీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపడం ఖాయమే అని భావించవచ్చు. దానికి ఈ బడ్జెట్‌తోనే శ్రీకారం చుట్టవచ్చు.