తుని ఘటనపై సీఐడీ విచారణలో భాగంగా ‘1 న్యూస్ ఛానల్’ ఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ‘చలో కాపునాడు’కు ముందుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనను సంప్రదించి మద్దతు కోరారని తెలిపారు. దీంతో మీడియా పరంగా ఆయనకు తాను సహకరించానని, కాపుల కోసం ఉద్యమమంటే తాను వెళ్లానని, నాటి సభా వేదికపై ఒకరి తర్వాత మరొకరు మాట్లాడదామని చెప్పి మొత్తం ఆయనే మాట్లాడారని, ఆ తర్వాత పట్టాలపైకి రావాలంటూ పిలుపు ఇవ్వడంతో తాను కూడా ఆశ్చర్యపోయానని సుధాకర్ తెలిపినట్లుగా సమాచారం.
రైలును తగలబెట్టాలన్న ఉద్దేశం యువకులకు లేదని, వారిని రెచ్చగొట్టడం వల్లే ఈ పనికి పాల్పడ్డారని, ఈ గొడవలో తనకు గాయాలు అయితే చూసేందుకు ముద్రగడ రాలేదని సుధాకర్ నాయుడు సీఐడీ అధికారుల ముందు వాపోయినట్టు తెలుస్తోంది. ఇక, సభలో వాడిన డ్రోన్ కెమెరాలను హైదరాబాద్ లోనే కొనుగోలు చేశారని, వాటిని ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేశారని, అయితే వాటిని ఎవరు స్పాన్సర్ చేసింది మాత్రం తనకు తెలియదని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఎటువంటి సాయం అందించారో కూడా తనకు తెలియదని సుధాకర్ నాయుడు పేర్కొన్నట్టు సమాచారం.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సోమవారం నాడు రాజమహేంద్రవరంలో సుధాకర్ నాయుడును విచారించగా, నేడు వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని విచారించనున్నారు. భూమన అరెస్ట్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపధ్యంలో నేటి సీఐడీ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, డ్రోన్ కెమెరాలు అందించిన వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.



