తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్, ఆయన పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. నేటికీ చెప్పుకుంటారు కానీ అంతగా కాదు.
కారణం.. సుమారు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేసరికే పిల్లర్లు క్రుంగిపోవడం, దాని దిగువన గల పలు బ్యారేజీలు దెబ్బ తిని నిరూపయోగంగా మారినందునే!
కనుక బిఆర్ఎస్ నేతలు దాని గురించి మాట్లాడటం తగ్గిస్తే, అధికారంలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడుతున్నారిప్పుడు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టి తనని అప్రదిష్టపాలుజేయలని ప్రయత్నిస్తున్నారని, దాని వలన రైతులు నష్టపోతున్నారని కేసీఆర్ వాదించేవారు. బ్యారేజీలకు మరమత్తులు చేసి వాడుకోవచ్చనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల వాదనలే వాటి నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని ధృవీకరిస్తున్నాయి కదా?
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ దాదాపు ఏడాది విచారణ జరిపింది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతోందని వార్తలు వచ్చాయి. కానీ కమీషన్ గడువు మరో రెండు నెలలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బహుశః కేసీఆర్, హరీష్ రావుల కోసమే అయ్యుండవచ్చు.
ఈ ప్రాజెక్టుని నేనే డిజైన్ చేసి, కుర్చీ వేసుకు కూర్చొని దగ్గరుండి మరీ కట్టించానని కేసీఆర్ పదేపదే గొప్పలు చెప్పుకునేవారు. ఆయన కూర్చోలేదు కానీ ఆ సమయంలో సాగునీటి శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు ప్రాజెక్టు వద్ద పడుకొని పనులు చేయించారు. ఆ విషయం ఆయనే గొప్పగా చెప్పుకున్నారు.
కానీ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ వారిద్దరినీ ప్రశ్నించకుండా ‘మమ’ అనిపించేస్తోందని విమర్శలు మొదలయ్యాయి. కనుక వారిద్దరినీ ప్రశ్నించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం కమీషన్ గడువు రెండు నెలలు పొడిగించిందని భావించవచ్చు.
కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు పంపిస్తే కమీషన్ ఎదుట హాజరవకపోవచ్చు. కానీ ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మరో అవకాశం కల్పిస్తుంది.
కానీ ఇతర కేసులలో కేసీఆర్, కేటీఆర్‌లపై చర్యలు తీసుకోకుండా కేంద్రం అడ్డుపడుతోందని సిఎం వంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని కమీషన్ నివేదికలో తేల్చి చెప్పినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోగలదా?




