పక్కా ప్రణాళిక ప్రకారం షూటింగ్స్ జరుపుకుంటున్న చిత్ర యూనిట్లకు ‘సూర్యదేవుడు’ మామూలుగా షాక్ ఇవ్వడం లేదు. మే మాసంలో సెగలు కక్కే వేడిమి ఏప్రిల్ నెలలో ఉండడంతో సినిమాల షూటింగ్ లకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. చాలా సినిమాల షూటింగ్స్ ఈ ఎండ వేడిమిని తట్టుకోలేక వాయిదాలు వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం విదేశాలలో ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఆగష్టు 12వ తేదీన విడుదల అని ప్రకటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ కు మాత్రం మరో అవకాశం లేకుండా పోయింది. దీంతో సెగలు కక్కే ఎండలో కూడా షూటింగ్ జరుపుకుంటోంది చిత్ర యూనిట్. దీనికి సంబంధించి ఒక ఫోటోను షేర్ చేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్… ‘జనతా గ్యారేజ్’ సిబ్బందికి ‘హ్యాట్సాఫ్’ చెప్పారు. మండుతున్న ఎండలో కష్టపడుతున్న చిత్ర యూనిట్ ను గుర్తించి, అభినందించడం బహుశా వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
నిజానికి షూటింగ్ సమయంలో ఎక్కువగా కష్టపడేది కూడా వారే. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్యులకు ఏసి బస్సులు గానీ, కార్లు గానీ ఉంటాయి. షాట్ అయిపోగానే వారంతా వాహనాల్లోకి వెళ్ళిపోయి సేద తీరుతుంటారు. కానీ సిబ్బంది మాత్రం తదుపరి షాట్ కు మళ్ళీ తమ పనిలో నిమగ్నమవుతారు. సాధారణ పరిస్థితుల్లో అయితే, పర్వాలేదు గానీ, మనుషులను కబళించి వేస్తున్న ఈ ఎండలో పని చేయడమంటే… నిజంగా జూనియర్ చెప్పిన “హ్యాట్సాఫ్”కు ప్రతి ఒక్కరూ అర్హులే!



