‘చిన్నమ్మ’ కోసం తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి, ఆ తర్వాత తిరుగుబాటు ప్రకటించిన పన్నీర్ సెల్వంకు సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం పదవి కోల్పోవడంతో… ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని పన్నీర్ కు పీడబ్ల్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పార్టీలో సీనియర్ వ్యక్తిగా ఇన్నాళ్ళు ఉన్నా గానీ, సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకోకపోవడంతో, అద్దె ఇంటిని వెతుక్కునే పనిలో పడ్డారు పన్నీర్.
2011లో అన్నాడీఎంకే గెలుపొందిన తర్వాత పన్నీర్ సెల్వం ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అప్పుడు ఆయనకు చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన బంగ్లాను కేటాయించారు. జయలలిత జైలుకు వెళ్లిన తర్వాత పన్నీర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆ బంగ్లా మారకుండా అదే ఇంట్లో ఉంటున్నారు. తాజాగా పదవిని కోల్పోవడంతో, బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యారు. వాస్తవానికి పదవిని కోల్పోయినా… జనాల్లో మాత్రం పన్నీర్ సెల్వంకు క్రేజ్ బాగానే ఉంది.
ప్రతి రోజు పన్నీర్ ను కలవడానికి భారీ సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు నివాసం వద్దకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో… పీడబ్ల్యూడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన తర్వాత, బంగ్లాను ఖాళీ చేయడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని పన్నీర్ వర్గీయులు కోరుతున్నప్పటికీ, ఆ నివాసాన్ని ఖాళీ చేయాలనే నిర్ణయానికి పన్నీర్ వచ్చేశారని తెలుస్తోంది. పదవి కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా? అంటూ తమిళనాడు రాజకీయాలపై సెటైర్లు పడుతున్నాయి.



