ఒకప్పుడు ఆదాయం, ఖర్చులు అన్నీ నగదు రూపంలో జరిగేవి. కనుక చేతితో పట్టుకొని కళ్ళతో నోట్లను చూస్తూ బుర్రతో లెక్కించేవారు. కనుక తరుగుతున్న, పెరుగుతున్న ఆ నోట్ల విలువని అందరూ సులువుగా అర్ధం చేసుకోగలిగేవారు. కానీ ఇప్పుడు చేతికి నోట్లు తగలడం లేదు.
కష్టపడి నెలరోజులు కష్టపడి పనిచేస్తే వచ్చే జీతం కటింగులు పోనూ బ్యాంకులో పడుతుంది. మొబైల్ ఫోన్లలో నాలుగు బటన్స్ నొక్కితే నెలరోజుల కష్టం కరిగిపోతుంది. నాలుగు రోజులలో నెల రోజుల కష్టం మాయమైపోతుంది!
కనుక డబ్బు ఎలా పోతోందో తెలిసేలోపుగానే అంతా ఖర్చయిపోతోంది. అలాగని అందరూ వృధా ఖర్చులు చేస్తున్నారని కాదు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు వచ్చిన జీతం ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, పండగలు, పబ్బాలు, వైద్య చికిత్సలు, మందులకు సరిపోతుంది.
కానీ ఆన్‌లైన్ కొనుగోళ్ళు, ఇంటికే భోజనం, టిఫిన్స్, పప్పులు, ఉప్పులు, కూరగాయలు సమస్తం తెచ్చి అందించే సంస్థలు అందుబాటులోకి వచ్చాక ఖర్చుల వేగం మరింత పెరిగిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలలో కొత్తిమీర కట్ట కోసమో అగ్గిపెట్టె కోసమో బైకు, కారేసుకు వెళితే చాలా ఖర్చు అవుతుంది. సమయం వృధా అవుతుంది. కనుక అలాంటి పెద్ద నగరాలలో ఆన్‌లైన్‌లో సరుకులు తెప్పించుకోవడమే మంచిది. అదే సులువు కూడా.
కానీ ఈ ఆన్‌లైన్ షాపింగ్ గ్రామాలకు కూడా పాకిపోయింది. ఆన్‌లైన్ షాపింగ్ కూడా ఇప్పుడు వ్యసనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. పైగా రకరకాల ఆఫర్లు ఊరిస్తూనే ఉంటాయి. ఒక్కోసారి తీవ్ర పని, మానసిక ఒత్తిళ్ళ నుంచి బయటపడటానికి కొందరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారు.
కనుక అవసరానికో, ఆనందం కోసమో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఇవి కాక కార్లు, బైకులు, ఇళ్ళు, స్థలాలు, పాలసీల ఈఎంఐలు నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతూనే ఉంటాయి. మరోపక్క నితావసర సరుకుల ధరలు, వివిధ ఛార్జీలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏదీ తగ్గడం లేదు.
ప్రభుత్వోద్యోగుల విషయానికి వస్తే వారికి కేవలం ఉద్యోగ భద్రత మాత్రమే ఉంది. కానీ నెలనెలా జీతాలు, ఏటా ఇంక్రిమెంట్స్, పదవీ విరమణ బెనిఫిట్స్ విషయంలో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఎప్పుడూ దయనీయంగానే ఉంటుంది.
ఓ పక్క పెద్ద పెద్ద ఐటి కంపెనీలు అకస్మాత్తుగా వందలు, వేలాదిమందిని ఉద్యోగాలలో నుంచి తీసేస్తున్నాయి. కనుక ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు. కనుక ఇప్పుడు వైట్‌కాలర్ జాబ్స్ చేసేవారు మొదలు సామాన్య మద్య తరగతి ప్రజల వరకు అందరి పరిస్థితి ‘టైట్ రోప్ వాక్’లానే సాగుతుందని చెప్పక తప్పదు.
ఇలాంటి పరిస్థితులలో ఆన్‌లైన్ ఖర్చులను అదుపు చేసుకొని డబ్బు పొదుపు చేయడం చాలా అవసరం. బొటాబొటి ఆదాయం ఉన్నవారు ఎలాగూ డబ్బు వృధా చేయ(లే)రు. కానీ ఆదాయంలో కనీసం 10-20 శాతం సేవింగ్స్ చేయగలిగే అవకాశం ఉన్నవారు ఈవిదంగా ఖర్చులు చేస్తుంటే ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క!







