ప్రతిపక్షాల చేతుల్లో నిసహాయంగా ప్రభుత్వాలు!

Opposition pressure forcing governments to defend themselves in Andhra Pradesh and Telangana politics

ఇదివరకు అధికార పార్టీలు, వాటి ప్రభుత్వాలతో రాజకీయ వేధింపులకు భయపడో లేదా ప్రభుత్వంలో తమ కాంట్రాక్టులు, ఇతర పనుల కోసమో లేదా వేరే కారణాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులు కాస్త ఆచితూచి మాట్లాడుతుండేవారు. ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షపార్టీ నేతల పనులు చేసి పెడుతుండేవి.

అందువలన రాజకీయాలలో ప్రశాంతత ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల దూకుడు తట్టుకోవడం ప్రభుత్వాలకు చాలా కష్టంగా మారింది. అమితమైన అధికారం, యావత్ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉన్నా కూడా ప్రతిపక్షాలకు భయపడుతూ, అవి చేసే విమర్శలకు, ఆరోపణలకు ముఖ్యమంత్రులు, మంత్రులు మీడియా సమావేశాలు పెట్టుకొని సంజాయిషీలు ఇచ్చుకునే దుస్థితి నెలకొంది.

ADVERTISEMENT

ఉదాహరణకు ఏపీలో వైసీపీ, తెలంగాణ బీఆర్ఎస్‌ పార్టీ అధినేతలు, నేతలపై అనేక తీవ్రమైన కేసులు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వాలు వారిని టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాయి.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న కరీంనగర్‌ సభలో మాట్లాడుతూ, “కాళేశ్వరం, ఫార్ములా వన్ రేసింగ్ కేసులలో అవినీతికి పాల్పడిన కేసీఆర్‌, హరీష్‌ రావు, కేటీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలలో బిజేపి ఓట్లు అడగాలి,” అని అన్నారు.

ఈ మూడు కేసులు రాష్ట్రానికి సంబందించినవి. ఏసీబీ, విజిలెన్స్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, సిట్‌ అధికారులు విచారణ జరిపి వీటిలో అవినీతి, అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పారు.

ఇవి కాక ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ వంటి ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కూడా వారి ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. కానీ వారిని రేవంత్ ప్రభుత్వం టచ్ చేయలేకపోతోంది.

టచ్ చేస్తే ‘జాతిపిత’ చుక్కలు చూపిస్తున్నాడు. బహుశః అందుకే సిఎం రేవంత్ రెడ్డి వారి ముగ్గురినీ లోపలేసే బాధ్యత తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారనుకోవచ్చు. ఇది ప్రభుత్వ నిసహాయత కాదా?

ఇక్కడ ఏపీలో వైసీపీ నేతలపై వివేకా హత్య కేసు మొదలు మద్యం కుంభకోణం, నకిలీ మద్యం, తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు వరకు డజన్ల కొద్దీ కేసులున్నాయి. కానీ ప్రభుత్వం వీటన్నిటి సూత్రధారిని, అంతిమ లబ్దిదారుని టచ్ చేయలేకపోతోంది!

రెండు రాష్ట్రాలలో అవినీతికి, అక్రమాలకు పాల్పడినవారే ముఖ్యమంత్రులను ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. కానీ ప్రభుత్వాలు వారిని టచ్ చేయలేకపోతున్నాయి. తమని టచ్ చేయలేరని, దమ్ముంటే టచ్ చేసి చూపించాలని వారు కూడా సవాళ్ళు విసురుతున్నారు.

వారిని టచ్ చేయకుండా ఏ అదృశ్యశక్తులు ఆపుతున్నాయి?రాజకీయ కారణాలు, బంధుత్వాలు, కుల సమీకరణాలు, ఎన్నికలు, ఓట్లు, సానుభూతి లెక్కలు వంటివి చూసుకుంటూ ఆగిపోతున్నాయా?

ఈ ప్రాతిపదికన అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడినా తప్పించుకునే వెసులుబాటు రాజకీయ పార్టీలు, వాటి నాయకులే ఏర్పాటు చేసుకున్నారా?పన్నులు, చార్జీల బాదుడు భరించే సామాన్య ప్రజలకే ఈ చట్టాలు, నిబంధనలు, ఆంక్షలా?రాజకీయ నాయకులకు వర్తించవా? వారు చట్టాలకు అతీతులా?

ADVERTISEMENT
Latest Stories