రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పాదయాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష హోదాలో వైఎస్ రాజశేజర్ రెడ్డి 2003 ఏప్రిల్ 9 న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు దాదాపు 66 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసారు.
వైఎస్ఆర్ మొదలుపెట్టిన ఆ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది, రాజశేఖర్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసింది. ఇక నాటి నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు ఈ పాదయాత్ర అనేది అధికారాన్ని అందించే ఒక దివ్యాస్త్రంగా మారిపోయింది.
అటు తరువాత 2014 రాష్ట్ర విభజన తో అస్తవ్యస్తంగా మారిన ఆంద్రప్రదేశ్ భవిష్యత్ ను గాడిన పెట్టేందుకు అపార రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసారు.
దీనితో పదేళ్ల టీడీపీ ప్రతిపక్ష పాత్ర కాస్త అధికార పక్షానికి చేరింది. ఇక 2019 లో వైసీపీ అధినేత వైస్ జగన్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ‘ప్రజాసంకల్ప’ యాత్ర పేరుతో మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆ పాదయాత్రతోనే తన పార్టీని అధికార పీఠం ఎక్కించారు.
ఇక అదే ఆనవాయితీని కొనసాగిస్తూ 2019 నుంచి 2024 వరకు ఉన్న ఐదేళ్ల ప్రతిపక్షానికి చెక్ పెట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యువగళం’ పాదయాత్రకు నడుం బిగించారు.
దీనితో వైసీపీ అరాచకాలతో, బాబు అరెస్టుతో దాదాపు చావు అంచుల వరకు వెళ్లిన టీడీపీ పార్టీకి తిరిగి జీవం పోసి పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చారు. దీనితో లోకేష్ యువగళం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.
ఇక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు సంఘీభావంగా 2023 ఫిబ్రవరిలో ములుగు జిల్లా మేడారం నుంచి పాదయాత్ర చేసారు. రేవంత్ పాదయాత్ర కూడా పదేళ్ల కాంగ్రెస్ నిరీక్షణకు ముగింపు పలుకుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి అధికార పీఠం ఇచ్చింది, అలాగే ఎవ్వరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసింది.
ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాజకీయ నేతలు చేపడుతున్న పాదయాత్రలు వారి పార్టీకి అధికారాన్ని అప్పగిస్తున్నాయి, వారికి ముఖ్యమంత్రి పదవులను కట్టబెడుతున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏ అధికారం కావాలని పాదయాత్రల పేరుతో రాజకీయ నాయకులు, పార్టీల అధినేతలు ప్రజల వద్దకు వస్తున్నారో అదే నేతలు ఒక్కసారి అధికార పీఠం అందగానే అదే ప్రజలకు దూరం అవుతున్నారు.
తిరిగి వారి పార్టీ మళ్ళీ ప్రతిపక్షానికొస్తే తప్ప ఆయా నేతలకు ప్రజల అవసరం కానీ పాదయాత్రల అవసరం కానీ రావడం లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అంటే పాదయాత్రలు అనేవి కేవలం ప్రతిపక్ష నాయకుల అధికారం కోసమేనా.? అధికార పార్టీ నేతలకు ఈ యాత్రల అవసరం ఉండదా.?
ఇప్పటికే ఏపీలో వైసీపీ అధినేత వైస్ జగన్ వైసీపీ 2.0 కోసం వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా, ప్రజా సమస్యల మీద పోరాడతా, టీడీపీ కి సినిమా చూపిస్తా అంటూ ప్రకటించారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ను మూడోసారి గద్దెనెక్కించేందుకు 2027 లో కేటీఆర్ పాదయాత్రకు సిద్దమయినట్టు ప్రకటించారు.
మరి తమ అధికారాన్ని అలానే కొనసాగించేందుకు ఏపీలో కూటమి పార్టీల నుంచి కానీ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి కానీ ఎవ్వరు పాదయాత్ర బాట పట్టారా.?




