తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ‘విశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టిన నేపథ్యంలో… చెలరేగిన గందరగోళం… వాయిదాల అనంతరం… అసెంబ్లీ స్పీకర్ ధన్ పాల్ బలపరీక్షను కొనసాగించారు. ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా కొనసాగిన పలు పరిణామాల అనంతరం… సభ నుంచి డీఎంకే సభ్యులు వెళ్లిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ కూడా వాకౌట్ చేసింది. ఈ క్రమంలో, డివిజన్ విధానాన్ని పక్కన పెట్టిన స్పీకర్… మూజువాణి విధానంతో ఓటింగ్ నిర్వహించారు.
అనంతరం విశ్వాస పరీక్షలో పళనిస్వామి గెలిచినట్టు ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే శిబిరంలో ఆనందానికి అవధులు లేవు. చివరకు అమ్మే గెలిచింది అంటూ పళనిస్వామి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో సిఎంగా తనది మూన్నాళ్ళ ముచ్చట కాదని, ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పళనిస్వామి ప్రకటించుకున్నట్లయ్యింది. ప్రతిపక్ష పార్టీలు లేకుండానే కొనసాగిన ఈ ప్రక్రియలో… అసెంబ్లీ సాక్షిగా శశికళ వర్గం ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేసిందని పన్నీరు సెల్వం వర్గం మండిపడింది.
శాసనసభలో పళనిస్వామి బల పరీక్షలో నెగ్గిన అనంతరం తన మద్దతుదారులతో బయటకు వచ్చి, జయలలిత అభీష్ఠానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడిందని, దీనిపై ప్రజాన్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి జరిగిన దారుణాన్ని వివరిస్తామని, ఈ రోజు ఓడింది తాము కాదని, ధర్మం, న్యాయం ఓడిపోయాయని, ఇది మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఒక భాగమని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. శాసనసభలో మాఫియా తిష్ఠ వేసిందని, న్యాయం కోరితే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, డీఎంకే నేతలను స్పీకర్ ధన్ పాల్ బహిష్కరించిన నేపథ్యంలో… తాము అసెంబ్లీ బయటకు వెళ్లబోమని చెప్పి అక్కడే ఉండిపోయిన డీఎంకే నేతలను మార్షల్స్ ఎట్టకేలకు బయటకు తీసుకువచ్చారు. స్పీకర్ తన చొక్కా తానే చింపుకొని డీఎంకే నేతలు చింపారని అవాస్తవాలు చెబుతున్నారని, తాము సభలో కేవలం రహస్య ఓటింగ్‌కు మాత్రమే పట్టుబట్టామని, స్పీకర్ ఆదేశాలతో సభలోకి పోలీసులు సైతం వచ్చి తమను బయటకు లాక్కొచ్చారని, తన చొక్కా చిరిగిపోయిందని, తన చినిగిన చొక్కాని చూపిస్తూ విమర్శలు గుప్పించారు స్టాలిన్.



