శశికళపై వార్ డిక్లేర్ చేసిన పన్నీర్!

Panneerselvam-delcares war on sasikala natarjanశశికళ వర్గంపై తన యుద్ధాన్ని మరోసారి పన్నీర్ సెల్వం ప్రారంభించారు. తనకు మద్దతుగా నిలిచిన 12 మంది ఎంపీలతో రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30కి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించగా, తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు వివరించి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో జయలలిత మృతిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా విచారణ చేయించాలని కూడా పన్నీర్ కోరనున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన రభస, వివాదాస్పద వాతావరణం నేపథ్యంలో బల నిరూపణ జరిగిన పద్ధతి పైనా వివరించే అవకాశాలు ఉన్నాయి. కాగా పన్నీర్ తో పాటు 10 మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఢిల్లీకి వెళ్లినట్టు వీ మైత్రేయన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మరో వైపు ప్రతిపక్ష డీఎంకే సైతం మరోసారి బల నిరూపణకు ఆదేశించాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.

ఇక, కర్ణాటక జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ముగ్గురు ముఖ్యులైన మంత్రులను తన వద్దకు పిలిపించుకున్నారు. శశికళ పిలుపుతో మంత్రులు సెంగొట్టయ్యన్, బాలకృష్ణారెడ్డి, దిండిగల్ శ్రీనివాసులు బెంగళూరుకు చేరుకున్నారు. పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లి శశికళతో మంతనాలు జరపనున్నారు. తమిళనాడులో కొత్త పార్టీలు మొదలు కావడం, పన్నీర్ సెల్వంకు అనుకూలంగా దివాకరన్ వ్యాఖ్యలు తదితరాలపై వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories