రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ కాసేపటి క్రితం రాజీనామా చేసారు. విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు.
“ప్రభుత్వంలో నా ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు. పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం,” అని పరకాల తన లేఖలో ప్రస్తావించారు.
పరకాల రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదిస్తారో లేదో చూడాలి. ఆమోదిస్తే పరకాల తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా ఆశ్చర్యకరంగా మారింది. తెలుగుదేశం తరపున పని చేసినా ఇదే ఇబ్బంది వస్తుంది గనుక అది ఉండకపోవచ్చు. టీవీ చర్చల్లో మునుపటిలా పాల్గొనటారేమో చూడాలి. ఇటీవలే బైపాస్ సర్జరీ జరగడంతో పరకాల అంత యాక్టీవ్ గా అయితే లేరు.



