‘పరుచూరి పాఠాలు’ పేరుతో సినిమాలపై తనకున్న భావాలను పరుచూరి గోపాలకృష్ణ పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ ల “అజ్ఞాతవాసి” సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పరుచూరి. ‘అత్తారింటికి దారేది’ వంటి అద్భుతమైన కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా పూర్తి వినోదభరితమైన చిత్రం. ఈ సినిమాను చూడగానే నేను ఒకటి అనుకున్నాను. ‘రక్త తిలకం’ సినిమా కోసం మేం చేసిన మార్పును త్రివిక్రమ్ కూడా చేసి వుంటే బాగుండునే అనిపించింది.
త్రివిక్రమ్ ఎలా అయితే తన సినిమాకు ఆర్డర్ రాసుకున్నాడో… మేం కూడా ‘రక్త తిలకం’ సినిమాకి అలాగే రాసుకున్నాము. అప్పుడు రామానాయుడు గారు… ‘అదేంటయ్యా… తల్లి మంచంలో పడి వుంటే హీరో ఎలా డ్యూయెట్లు పాడుకుంటాడు, నాకు నచ్చలేదు మార్చేయండి’ అన్నారు. అలాంటి ఆలోచన ‘అజ్ఞాతవాసి’కి ఎవరూ చెప్పలేదు. ఈ సినిమాలో తండ్రి పాత్ర, సోదరుడి పాత్ర హత్యకి గురవుతాయి. అప్పుడు పగ తీర్చుకోవడానికి బయల్దేరిన హీరో, ఆ హంతకులను లేపేస్తాడనే అంతా భావిస్తారు.
కానీ అలా జరగకుండా హీరో బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఆడియన్స్ కి నిరాశ కలగడంలో నాకు ప్రధానమైన కారణంగా ఇది కనిపించిందని చెప్పుకొచ్చారు. అలాగే ‘అత్తారింటికి దారేది’ సన్నివేశాలు చాలా ఈ సినిమాలో కనపడడం కూడా పెద్ద మైనస్ పాయింట్ గా అభివర్ణించారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సీఈవో పోస్టులు… అందరూ రౌండ్ గా కూర్చుని మాట్లాడుకోవడాలు వంటి సీన్స్ వున్నాయి… అదే తరహా సీన్స్ ను ‘అజ్ఞాతవాసి’లో పెట్టడం వలన రిపిటేషన్స్ లా అనిపించాయి, వాటిని ఎవైడ్ చేసుంటే బాగుండేది.
అలాగే ‘అత్తారింటికి దారేది’లో మేనత్త దగ్గర హీరో ఎలాగైతే కన్నీళ్లు పెట్టాడో, అదే విధంగా ఈ సినిమాలో ఖుష్బూ పాత్ర దగ్గర కన్నీళ్లు పెడతాడు. ‘అబ్బా మళ్లీ అలాంటి సీనే’ అనిపిస్తుంది. పవన్ తో అంతకుముందు చేసిన సినిమాల్లోని సన్నివేశాలకు దగ్గరగా లేకుండా చూసుకోవలసింది. ఏదేమైనా త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు… పవన్ మంచి నటుడు అనడంలో సందేహం లేదు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను… ఎందుకంటే నేనూ ఆయన అభిమానినే” అని పవన్ ఫ్యాన్స్ దాడి చేయకుండా చెప్పుకొచ్చారు.



