నాకు తిక్కుంది దానికో లెక్కుంది… నిజమేగా!

Pawan-Kalyan-Again-On-Allianceపవన్‌ కళ్యాణ్‌ తన నాలుగు సినిమా షూటింగ్‌లు వాయిదా వేసుకొని గోదావరి జిల్లాలలో 15 రోజుల పాటు వారాహి యాత్ర చేపట్టడమే ఆశ్చర్యం అనుకొంటే, మళ్ళీ ఆదివారం నుంచి ఏలూరులో వారాహి రెండో విడత యాత్రని కూడా ప్రారంభించడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

ప్రజల మద్యకు వెళ్ళే ముందు మంగళగిరిలో పార్టీ నేతలతో పొత్తుల గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది కనుక పార్టీలో ఎవరూ వాటి గురించి ఆలోచించవద్దు… మాట్లాడొద్దని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టమైన ఆదేశం ఇవ్వడం ఆలోచింపజేస్తుంది.

జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేక బిజెపితో కలిసి చేస్తుందా లేక టిడిపి, బిజెపి, జనసేన మూడూ కలిసి పనిచేస్తుందో తెలియక పార్టీ నేతలు, కార్యకర్తలే అయోమయానికి గురవుతున్నారు. దానిపై వారికి స్పష్టత లేకపోతే నిత్యం ప్రజల మద్య తిరిగేవారు ప్రజలకు ఏమని చెప్పుకొంటారు?

కనుక పవన్‌ కళ్యాణ్‌ వారికి పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తారనుకొంటే ‘అప్పుడే కాదు… ఎవరూ మాట్లాడొద్దు’ అని చెప్పడం చూస్తే ‘నాకు తిక్కుంది దానికో లెక్కుంది,’ అనే ఆయన చెప్పిన ఓ సినిమా డైలాగ్‌ గుర్తురాక మానదు. అయితే నిజంగానే ఆయన లెక్కలు ఆయనకున్నాయి.

ఈసారి ఎట్టి పరిస్థితులలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రానీయనని పవన్‌ కళ్యాణ్‌ చెపుతున్నారు. అందుకోసం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనీయనని పదేపదే చెపుతున్నారు.

నేటికీ బిజెపి, జనసేనలు మద్య పొత్తు ఉంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ టిడిపిని కూడా కలుపుకుపోవాలనుకొంటున్నారు. టిడిపి కూడా బిజెపి, జనసేనలతో కలిసి పనిచేయాలనే అనుకొంటోందనేది బహిరంగ రహస్యం. బహుశః టిడిపితో పొత్తు ఎందుకు అవసరమో ఢిల్లీ బిజెపి పెద్దలకు పవన్‌ కళ్యాణ్‌ వివరించే ఉంటారు.

ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి బిజెపి పెద్దల భేటీ అయ్యారు. ఆ తర్వాతే ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో బిజెపి మిత్రపక్షాలు (ఎన్డీయే) సమావేశంలో పాల్గొనవలసిందిగా టిడిపిని బిజెపి పెద్దలు ఆహ్వానించిన్నట్లు సమాచారం. అంటే బిజెపి కూడా టిడిపి విషయంలో మనసు మార్చుకొని దానితో కలిసి పనిచేసేందుకు సిద్దపడుతోందని అర్దమవుతోంది.

అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకొంటోంది. కానీ ఏపీలో టిడిపి, జనసేన, బిజెపిలు మూడూ కలిసి పనిచేసే మాటైతే ఈ విషయంలో టిడిపి వెనక్కు తగ్గాలని బిజెపి కోరుకొంటోంది.

పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రలో ‘నేను ముఖ్యమంత్రిని అవుతా, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని’ చెపుతున్న మాటలకి బహుశః అదే అర్దం కావచ్చు.

కనుక టిడిపి ఈ షరతు లేదా ప్రతిపాదనకు అంగీకరిస్తే మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. ఈ విషయం ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం తర్వాత స్పష్ఠత రావచ్చు. టిడిపి ఇందుకు అంగీకరిస్తే అప్పుడు మూడు పార్టీల మద్య సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలవుతాయి. లేకుంటే బిజెపి, జనసేనలు కలిసి పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేయవచ్చు. బహుశః ఇందుకే పవన్‌ కళ్యాణ్‌ పొత్తుల గురించి తన పార్టీ నేతలెవరూ మాట్లాడవద్దని కట్టడి చేస్తున్నట్లున్నారని భావించవచ్చు.

తెరవెనుక ఇదే జరుగుతోందని వైసీపీ కూడా గట్టిగా నమ్ముతోంది కనుకనే ‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని, 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలంటూ’ టిడిపి, జనసేనలకు పదేపదే సవాళ్ళు విసురుతున్నట్లు అర్దమవుతోంది.

కానీ మూడు పార్టీల మద్య అధికారం పంచుకోవడంపై స్పష్టత లేకుండా గుడ్డిగా పొత్తులు పెట్టుకొని ముందుకు సాగడం వలన మున్ముందు వారి కూటమి విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుకనే దీనిపై పూర్తి స్పష్టత కోసం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎదురుచూస్తున్నట్లున్నారు.

కనుక పవన్‌ కళ్యాణ్‌కు తిక్క ఉన్నట్లు కనిపించవచ్చు కానీ ఖచ్చితంగా దానికో లెక్కుంది అని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories