భీమవరం ఎస్పీ జయసూర్య వ్యవహారంలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత వంగలపూడికి మద్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ వైసీపీ సోషల్ మీడియాలో మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. కానీ డెప్యూటీ సిఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తనకు జయసూర్య వ్యవహారం చూడమని చెప్పడాన్ని తప్పుగా భావించడం లేదని, ఇది కూటమి ప్రభుత్వంలో ఐఖ్యతకు, పరస్పర అవగాహనకు నిదర్శనంగా చూడాలని హోం మంత్రి అనిత వంగలపూడి హితవు పలికారు.
ఓ పక్క కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నప్పుడు, ఉండి టీడీపి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు. ఒకవేళ ఏమైనా చెప్పదలచుకుంటే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత వంగలపూడిని నేరుగా కలిసి మాట్లాడవచ్చు.
కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి “జయసూర్య చాలా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ అని నాకు తెలుసు. గోదావరి జిల్లాలలో పేకాడటం చాలా కామన్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా పేకాట శిబిరాలు లేవు. ఒకవేళ ఉంటే జయసూర్య వాటిపై దాడులు జరిపించి కేసులు నమోదు చేస్తున్నారు. ఆ కోపంతోనే ఎవరో ఆయనపై డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కి పిర్యాదు చేసి ఉండవచ్చు,” అని అన్నారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ భీమవరం ఎస్పీ జయసూర్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ జరిపించాలని హోం మంత్రి అనిత వంగలపూడిని, డీజీపీని కోరినప్పుడు, రఘురామ కృష్ణరాజు మద్యలో జోక్యం చేసుకొని జయసూర్యని వెనకేసుకువస్తే ‘కూటమి ప్రభుత్వంలో లుకలుకలు’ అంటూ వైసీపీ ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించినట్లే అవుతుంది కదా? కనుక రఘురామ ఈసారి రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్లే అనిపిస్తుంది.




