తెలంగాణలో ముసుగు రాజకీయాలు…ఇంకెంతకాలం.?

Revanth Reddy vs Kishan Reddy: Telangana Politics Gets Intense

తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి vs కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు ఒక సీరియల్ ను తలపిస్తున్నాయి. కిషన్ రెడ్డి బీజేపీ ముసుగు తొడుక్కున్న బిఆర్ఎస్ మనిషి అంటూ రేవంత్, రేవంత్ ముఖ్యమంత్రి ముసుగులో అక్రమాలకు పాలపడుతున్నాడని కిషన్ ఒకరి మీద మరొకరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకుంటున్నారు.

సింగరేణి బొగ్గు గనుల విషయంలో కూడా వీరిద్దరి మధ్య మాటాలతూటాలు పేలుతున్నాయి. సింగరేణి బొగ్గు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని కిషన్ రెడ్డి, కేంద్రం అన్యాయం చేస్తుందంటూ రేవంత్ రెడ్డి ఒకరి మీద మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

ఇక తాజాగా IRFC రుణాలకు సంబంధించిన అంశాల పై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ఎంపీ గా, కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ కోసం పని చేస్తున్నారని,

రాష్ట్ర మెట్రో విస్తరణకు IRFC నుంచి రావాల్సిన రుణాలను రానీయకుండా కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలిసి తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా.? అంటూ బెదిరిస్తూ అడ్డుపడుతున్నారని, ఈ రోజు సాయంత్రం లోపు కిషన్ ఆ నిధులను రాష్ట్రానికి విడుదల చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు సీఎం రేవంత్.

అలాగే కిషన్ రెడ్డికి నాకు గట్టు పంచాయితీలు, సరిహద్దులు తగాదాలు ఏమి లేవని, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పట్ల ఎంత గౌరవం ఉందో అంతే అసహనం కూడా ఉందని రేవంత్ కిషన్ టార్గెట్ గా విమర్శలు షురూ చేసారు. ఇదిలా ఉంటె అసలు తెలంగాణలో ఈ ట్రై యాంగిల్ రాజకీయాలు ఇంకెంత కాలం.?

కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ బీజేపీ మనిషి అంటూ రేవంత్ కి బీజేపీ ముసుగు వేస్తుంది బిఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని బీజేపీ కి గులాబీ రంగు అంటిస్తుంది కాంగ్రెస్, ఇక తెలంగాణలో బీజేపీ కి అధికార పీఠం అందకుండా చేయడానికి బిఆర్ఎస్, కాంగ్రెస్ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాయి అంటూ కాంగ్రెస్ చేతిలో కాషాయ కమలం పెడుతుంది బిఆర్ఎస్.

రేవంత్ చెపుతున్నట్టు గ అసలు బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి బీజేపీ కి రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బిఆర్ఎస్ తో ఉన్న రాజకీయ సంబంధం ఏమిటి.? రేవంత్ పదేపదే కిషన్ రెడ్డి ని కేసీఆర్ మనిషిగా, కేటీఆర్ సన్నిహితుడిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు.

భవిష్యత్ లో తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో బీజేపీ – బిఆర్ఎస్ రాజకీయ పొత్తుకు ఇప్పటి నుంచే కిషన్ రెడ్డి తెరవెనుక పునాదులు తవ్వుతున్నారా.? తెలంగాణలో బీజేపీ తానూ అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే ఒంటరి పోరాటం మార్గం కాదని టి. బీజేపీ తో పాటుగా బీజేపీ అధిష్టానం కూడా గ్రహించిందా.?

అందుకోసం కిషన్ రెడ్డి బిఆర్ఎస్ తో తెరచాటు రాజకీయ స్నేహాలు కుదుర్చుకుంటున్నారా.? లేదా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు సామెత మాదిరి రేవంత్ తన ఈ ఒక్క ప్రచారంతో అటు బీజేపీ ని ఇటు బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారా.? ఏదిఏమైనా తెలంగాణలో సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఈ ముసుగు రాజకీయాల ముసుగు తొలగేదెప్పుడు.? తొలగించేదెవరు.?

ADVERTISEMENT
Latest Stories