జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టిడిపిలో టికెట్ల కోసం చంద్రబాబు నాయుడుపై ఒత్తిళ్ళు ఉన్నట్లే, నాకూ ఉన్నాయి. ఆయన మొన్న ఓ రెండు నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించారు కనుక ఇవాళ్ళ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నేను ఓ ప్రకటన చేస్తున్నాను.
రాజోలు, రాజానగరం రెండు నియోజకవర్గాల నుంచి మన జనసేన అభ్యర్ధులే పోటీ చేస్తున్నారు. మనం టిడిపితో కలిసి ఎన్నికలకు వెళుతున్నాం. కనుక పొత్తులలో కాస్త సర్దుబాట్లు తప్పవు.
రెండు పార్టీలకు ఉమ్మడి మ్యానిఫెస్టో ఉంటుంది. నాకు జగన్‌తో సహా ఎవరి మీద కక్ష లేదు. కానీ ఆయనకు ఊరందరూ శత్రువులే. ఆయన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందనే బాధతోనే, ఆయన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయి. కనుక ప్రజలందరూ ఈసారి మాపై నమ్మకం ఉంచి మా రెండు పార్టీలకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
టిడిపి, జనసేనలు పొత్తులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా మండపేట, అరకు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించడాన్ని జనసేన తప్పు పట్టింది. బహుశః అందుకు ప్రతిగానే నేడు పవన్ కళ్యాణ్ కూడా కోనసీమ జిల్లాలోని రాజోలు, తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గాలకు జనసేన అభ్యర్ధులను ప్రకటించిన్నట్లు భావించవచ్చు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సమావేశమయ్యి సీట్ల సర్దుబాట్లు గురించి చర్చించుకున్నప్పుడు, ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చిన్నట్లే భావించవచ్చు. అయినా పార్టీలో అంతర్గత ఒత్తిళ్ళ కారణంగా ఎవరికి వారు పార్టీ అభ్యర్ధులను ప్రకటించుకుంటుంటే, రెండు పార్టీ శ్రేణులకు, ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ముఖ్యంగా ఇలాంటి అవకాశం కోసమే కాచుకు కూర్చొన్న వైసీపికి రెండు పార్టీల మద్య చిచ్చుపెట్టేందుకు అవసరమైన ‘చమురు’ అందించిన్నట్లవుతుంది కూడా. కనుక ఇకనైనా రెండు పార్టీలు సీట్ల సర్దుబాట్లు చేసుకుని తమ కూటమి ఉమ్మడి అభ్యర్ధులను ప్రకటిస్తే మంచిది.




