పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సరిగ్గా మరో పది రోజుల్లో బాక్సాఫీస్ ప్రభంజనం ఏమిటో రుచి చూపించడానికి సిద్ధమవుతున్నారు. అనేక వాయిదాల అనంతరం ఫిబ్రవరి 25వ తేదీన “భీమ్లా నాయక్” సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రకటన పవర్ స్టార్ ఫ్యాన్స్ లోనే కాదు, సినీ అభిమానుల్లో కూడా నూతన ఉత్సాహాన్ని నింపింది. “అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్” సినిమాలతో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ కు కరోనా సడెన్ బ్రేకులు వేసింది. అలాగే మరో వైపు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో తలలు పట్టుకోవడం సినీ నిర్మాతల వంతయ్యింది.
కరోనా అయితే తన ఉధృతిని తగ్గించుకుని ప్రేక్షకులకు ఉపశమనాన్ని కలిగించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం సినీ పరిశ్రమకు కావాల్సిన ఉపశమనాన్ని ఇప్పటికైతే అందించలేకపోయారు. అయినప్పటికీ ధైర్యంగా పవర్ స్టార్ తన సినిమా విడుదల తేదీని ప్రకటించడం అంటే జగన్ సర్కార్ తో తాడో పేడో తేల్చుకోవడానికేనా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల చిరంజీవి బృందం చర్చలు జరిపి వారం, పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని వెల్లడించారు గానీ, ఆ దిశగా ఎలాంటి సూచనలు కనిపించనప్పటికీ, “భీమ్లా నాయక్” మాత్రం తన రూట్ ను మార్చుకోలేదు. చెప్పిన సమయానికి ధియేటర్లలో రిపోర్ట్ చేయబోతున్నానని సగర్వంగా ప్రకటించాడు. ఇక బాల్ జగన్ కోర్టులో ఉంది.
ఒకవేళ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ కు కొత్త జీవోను ఇవ్వని పక్షంలో, తన సినిమా కోసమే వైసీపీ సర్కార్ జీవోను ఆపిందన్న ప్రచారం పవన్ కళ్యాణ్ చేసుకోవచ్చు. రాజకీయంగా ఇది జనసేన అధినేతకు కలిసి వచ్చే అంశం. అలాగే అన్ని సినిమాల కంటే ముందుగా ‘భీమ్లా నాయక్’ విడుదల కావడం అనేది మిగిలిన సినిమాలకు కూడా ఉపశమనం కలిగిస్తోంది.
పవన్ సినిమాను మినహాయిస్తే, జగన్ సర్కార్ ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి ఇతర సినిమాలేవీ లేవు గనుక, మిగిలిన పెద్ద సినిమాలన్నీ పవన్ తీసుకున్న నిర్ణయానికి ‘జై’ కొట్టొచ్చు. అలాగే రెండు నెలల తర్వాత విడుదల అవుతోన్న పెద్ద సినిమా కావడంతో, ప్రేక్షకుల ఆసక్తి మొదటగా ‘భీమ్లా నాయక్’ పైనే పడుతుంది. ఏ రకంగా చూసుకున్నా “భీమ్లా నాయక్” రిలీజ్ డేట్ సరైనదే అని చెప్పాలి.



