‘టార్గెట్ టిడిపి’ అంటూ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత చేసిన విమర్శలు తెలియనివి కావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు పార్టీల నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలు కొంత సమయం పాటు ప్రైవేటుగా సమావేశం కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
శుక్రవారం నాడు విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు – పవన్ లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కొంత సమయం పాటు సమావేశమై వివిధ అంశాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని, ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చనేది ఓ టాక్.
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చంద్రబాబు కంటే ముందే పవన్ తన సతీమణితో కలిసి చేరుకున్నారు. గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పుడు పక్కపక్కనే నిల్చున్న చంద్రబాబు-పవన్ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయ్యాక వేదపండితులు తొలుత పవన్ కు ప్రసాదం ఇవ్వబోగా… ‘కాదు, కాదు… తొలుత సీఎం గారికి ఇవ్వండి’ అని పవన్ అన్నారు. చంద్రబాబు పుచ్చుకున్నాక పవన్ తీసుకున్నారు. మొత్తానికి ఉప్పు-నిప్పులా ఉండే నేతలు ఇద్దరూ ఒకే గదిలో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరి భేటీపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.



