ఏపీలో ఇంతవరకు వైసీపీ, టిడిపిల మద్యనే రాజకీయ ఆదిపత్యపోరు సాగుతుండేది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ మంచి పేరు సంపాదించుకొంటున్నప్పటికీ, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగానే చెపుతున్నారు. ఇక వైసీపీ నమ్మకం, భవిష్యత్ అంతా జగనన్నే.
ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్రలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ “నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను. నాకూ ఒకసారి అవకాశం ఇవ్వండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. బాగా పరిపాలిస్తాను. నా పాలన బాగుంటే మరోసారి కూడా జనసేనకే అవకాశం ఇవ్వండి లేకపోతే రెండేళ్ళ తర్వాత నేనే ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోతాను,” అని చెపుతున్నారు.
“పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మాకు ఓకే” అని రాష్ట్ర బిజెపి చెప్పేసింది కనుక వచ్చే ఎన్నికలలో జనసేన బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతునట్లు భావించవచ్చు.
అయితే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితులలో చీలనీయనని చెప్పిన పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి బరిలో దిగితే ఖచ్చితంగా ఓట్లు చీలి, వైసీపీకి మేలు కలుగుతుంది. కనుక ఓట్లు చీలకుండా ఉండేందుకు జనసేన, బిజెపిలు టిడిపితో కలుస్తాయనుకొంటే, చంద్రబాబు నాయుడు ఉండగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరు కదా? మరి పవన్ కళ్యాణ్ పదేపదే “మా పార్టీని గెలిపించండి… నేను ముఖ్యమంత్రినవుతా… రాష్ట్రాన్ని చక్కబెడతా…” అని చెప్పడంలో మర్మం ఏమిటో?
“జనసేనకు ఒంటరిగా వైసీపీని ఎదుర్కోగల దమ్ముందా? చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ ఓపనిచేస్తున్నాడు. కాపు ఓట్లన్నిటినీ టిడిపికి జమా చేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేస్తాడు,” అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే పవన్ కళ్యాణ్ ఈవిదంగా చెపుతున్నారేమో?
“జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది… పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారనే” భావన, నమ్మకం ఆయన అభిమానులకు, కార్యకర్తలకు, కాపులకు కలిగితే తప్పకుండా జనసేన ఓటు బ్యాంక్ మరింత పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈవిదంగా నొక్కి చెపుతున్నప్పటికీ బిజెపి, టిడిపిలు స్పందించకపోవడం ఇది కూడా వాటి వ్యూహంలో భాగమేనేమో? అని సందేహం కలుగుతోంది.
కానీ మూడు పార్టీలు పోటీపడితే వాటి మద్య ఓట్లు చీలిపోవడం ఖాయం. అప్పుడు జనసేన అధికారంలోకి రాలేదు కానీ కొన్ని సీట్లు తప్పక గెలుచుకోగలుగుతుంది. కానీ ఓట్లు చీలిపోతే లాభపడేది వైసీపీయే అని పవన్ కళ్యాణ్‌కు తెలియదనుకోలేము. కనుక ఆయన వ్యూహం ఏమిటో తెలిసేవరకు ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్ధులు రేసులో ఉన్నట్లే భావించక తప్పదు.



