ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సోమవారం రాజమహేంద్రవరంలో జనసేన నాయకుల సమావేశంలో మాట్లాడిన తీరు అయన రాజకీయ పరిణతికి అద్దం పడుతోంది.
ముందుగా పార్టీ.. నేతలు, కార్యకర్తలని ఉద్దేశ్యించి చెప్పిన మాటల సారాంశం క్లుప్తంగా.. పార్టీకి నేనే సుప్రీం కమాండర్. అందరూ విధిగా నా ఆదేశాలు పాటించాల్సిందే. నా నిర్ణయాలను, వ్యూహాలను గౌరవించాల్సిందే. నచ్చనివారు బయటకు వెళ్ళిపోవచ్చు. పార్టీలోపల ఉంటూ సమస్యలు సృష్టిస్తానంటే చూస్తూ ఊరుకోను. నేనే బయటకు పంపిస్తాను.
పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఏది మేలు చేస్తుందో అదే నేను చేస్తాను తప్ప ఎవరో ఏదో అన్నారనో లేదా ఎవరికో అభ్యంతరాలున్నాయనో చీటికి మాటికి నా విధానాలు మార్చుకోను. నా మౌనాన్ని చాతకానితనంగా భావించొద్దు.
పార్టీలో అంతర్గతంగా, కూటమిలో భాగస్వామిగా ఎప్పుడూ కొన్ని సమస్యలు ఉంటాయి. అవి చాలా సహజం. వాటిని భూతద్దంలో చూడొద్దు. ఎవరైనా చూపిస్తే నమ్మి తప్పటడుగులు వేయొద్దు. ఇతర పార్టీల వలన జనసేనకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోను. ప్రతీ చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుంది. అది మనల్ని టార్గెట్ చేస్తున్న మీడియా అయినా సరే! అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు జనసేన నాయకత్వం చాలా బలంగా ఉందని తెలియజేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి పవన్ కళ్యాణ్ గట్టిగా జవాబు ఇచ్చినట్లే భావించవచ్చు.
పవన్ కళ్యాణ్ సిఎం చంద్రబాబు నాయుడుతో మర్యాదగా, విధేయంగా, మంత్రి నారా లోకేష్‌తో చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంటారు కనుక టీడీపి నేతలు, కార్యకర్తలు తనని, తన జనసేన పార్టీని ‘లైట్’ తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా సూచించినట్లే భావించవచ్చు.
జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పడం ఒక రాజకీయ పార్టీ అధినేతకు ఉండాల్సిన మంచి లక్షణమే. సినిమా ద్వారా లభించే ఆస్కార్ అవార్డ్ కంటే, ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు వారి కళ్ళలో కనిపించే సంతోషమే తనకు ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనిస్తే, పదవీ అధికారం కోసమే అయన రాజకీయాలలోకి రాలేదని చెప్తున్నట్లే ఉంది.




