ఇప్పటివరకు మాటల రచయితగా, దర్శకుడుగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్, త్వరలో మరో రూపం దాల్చబోతున్నాడు. పవర్ స్టార్ స్థాపించిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు. తొలి ప్రాజెక్ట్ గా హీరో నితిన్ తో కలిసి తమ తొలి చిత్రాన్ని లాంఛనంగా నేడు ప్రారంభించారు. ఈ సినిమా ద్వారా కృష్ణ చైతన్య అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.
నిజానికి ఈ సినిమాకు సంబంధించిన ‘హింట్’ను నితిన్ ఒక రోజు ముందే ఇవ్వగా, తాజాగా అది కార్యరూపం దాల్చుకుందని పూజా కార్యక్రమాల ఫోటోలతో నితిన్ ధృవీకరించాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్వయంగా కధను అందించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ తో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయని, నందిని రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక ప్రాజెక్ట్ కాగా, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
అయితే ఈ సినిమాల డైలాగ్స్ విషయంలో కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏ స్థాయి కధకైనా త్రివిక్రమ్ డైలాగ్స్ తోడయితే, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వడం ఖాయం. మరి ఈ మూడు సినిమాలకు ఎవరు డైలాగ్స్ అందిస్తారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి తన అభిమాని కోసం ఓ సినిమాను నిర్మించడానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు ముందుకు రావడం విశేషం.



