జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అతని కుమారుడుకు ఘాటుగా హెచ్చరించారు.జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు మీ కుమారుడిని అదుపులో పెట్టుకోపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే అవసరమైతే సిఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.
జనసేన ఫ్లెక్సీలను సైతం ఎమ్మెల్యే కుమారుడి ప్రోద్బలంతో తొలగిస్తున్నారని పవన్ ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే తనయుడు మాత్రం తమకు సంబంధం లేని విషయాల్లోకి తమను లాగొద్దని చెప్పారు. “పవన్ కళ్యాణ్ కు మాకు విరోధం పెంచడానికి ఎవరో చేస్తున్న కుట్ర ఇది. ఆయన వారి మాయలో పడకుండా ఉండాలి,” అన్నారు.
మరో వైపు సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీపార్టీతో కలిసి బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి. మహాకూటమికి ఈ బహిరంగ సభ అంకురార్పణ చేస్తుందా అనేది చూడాలి. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా పోటీ చేస్తామనే అంటున్నారు.



