జనసేన పార్టీ రాజకీయ ప్రణాళికల ఫలితాలు ఎలా ఉన్నా వినడానికి బావుంటాయి. సెప్టెంబర్ 7వ తేదీనాటికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నందున ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ది వంటి విషయాలపై అధ్యయనం చేయాలని నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై అధ్యయనం చేయడానికి 10 బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ బృందాల్లో 30 మంది సభ్యులను నియమించారు. ఎన్నికలలో ఘోరపరాజయం అనంతరం జనసేన పార్టీ జగన్ ప్రభుత్వానికి తాము 100 రోజుల సమయం ఇవ్వబోతున్నట్టు… అప్పటివరకూ ప్రభుత్వాన్ని తాము ఏ విషయంలోనూ విమర్శించం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇచ్చే రిపోర్టు బట్టి పార్టీ కార్యాచరణ ఉండబోతుందట. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జనసేన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది.
ఈ సమావేశాల అనంతరం అక్టోబర్ నుంచి క్షేత్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి వివరాలను క్రోడీకరించి సిద్ధపరచాలని, స్థానిక నాయకులకు తెలియచేయాలని పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీని ఆదేశించారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ సరైన గుర్తింపు ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చర్యలన్నీ జనసేన పార్టీ తిరిగి గాడిలో పెడతాయేమో చూడాలి.



