నాడు మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ ప్రారంభించినా… నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నా… అది అభిమానుల అండను చూసే అని చెప్పడంలో సందేహం లేదు. అయితే అభిమానులకు సముచిత స్థానాన్ని కల్పించడంలో చిరంజీవి విఫలం కాగా, ఆ విభాగంలో ప్రస్తుతం పవన్ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే నాడు చిరంజీవికి సహకారం అందించిన మెగా అభిమానులంతా పవన్ కోసం శ్రమించెందుకు ‘మెగా’ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లుగా స్పష్టమవుతోంది.
అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్న ఆర్.స్వామి నాయుడు ఈ నెల 9వ తేదీన ఎంతో అట్టహాసంగా జనసేనలో చేరుతుండడం ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఇటీవల చిరంజీవితో చర్చలు జరిపిన మీద తుది నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుగుణంగానే చిరు సమ్మతితో స్వామినాయుడు జనసేన జెండా పట్టుకోబోతున్నారని సమాచారం. చిరంజీవి పార్టీ విలీనం చేసినపుడు స్వామినాయుడు కూడా కాంగ్రెస్ లో చేరి, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
జనసేన చేరిక ఖాయం కావడంతో నేడో రేపో కాంగ్రెస్ కు రాజీనామా చేయడం ఖాయమైంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. స్వామినాయుడు చేరుతున్న సమయంలోనే ఇతర మెగా అభిమానులు కూడా భారీ సంఖ్యలో జనసేన జెండా పట్టుకునే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకించి ప్రసంగించనున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఈ అంశం హైదరాబాద్ లోనే జరగబోతోంది.



