కొద్దీ రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దేవ్ అనే అతనిని తమ పార్టీ వ్యూహకర్తగా నియమించినట్టు ప్రకటించారు. అయితే ఆయన బీజేపీ పార్టీ కోసం పని చేసిన ఒక చోటా లీడర్ అని అనేక ఎన్నికల సభలతో పాటు వివిధ ఛానెల్ డిస్కషన్స్ లోకూడా బీజేపీ తరపున మాట్లాడారని తాజాగా తెలిసింది.
పార్టీ వ్యూహకర్తలు వివిధ పార్టీలకు పని చెయ్యడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం జగన్ పార్టీ వ్యూహకర్త ఐన ప్రశాంత్ కిషోర్ గతంలో కాంగ్రెస్ కు బీజేపీ కు పని చేసారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఆ పార్టీ కండువాలు కప్పుకోలేదు. ఇక్కడ దేవ్ మాత్రం అసలుసిసలైన బీజేపీ కార్యకర్తలా కనిపించారు. సరే ఎంత మంది పార్టీలు మారారు లే అనుకుందాం.
కానీ ఆయన మీడియాలో ఆ వీడియోలు బయటకు వచ్చాక వాటిని డిలీట్ చెయ్యడం గమనార్హం. పైగా ఆ సదరు దేవ్ అని వ్యక్తి ఆ ప్రెస్ మీట్ లో తనకు తెలుగు సరిగ్గా రాదని ఇప్పుడే ఫ్లైట్ లో హైదరాబాద్ లో దిగిన నార్త్ ఇండియన్ లా బిల్డ్ అప్ ఇచ్చారు. అయితే ఆయన తెలుగు స్పషంగా మాట్లాడుతూ బీజేపీకి వంత పాడుతూ ఇచ్చిన ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో ఉన్నాయి.
ఇవన్నీ చూశాక ఏదో జరుగుతుంది అనే అనుమానం రాక మానదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు తెలుసా లేక ఆయనా మోసపోయారా? చాలా సంవత్సరాలుగా తనకు దేవ్ కు పరిచయం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంత పరిచయంలో ఇవన్నీ పసిగట్టకపోయారు అంటే జనసేన శ్రేణులు నిజంగానే కలవరపడాల్సిందే.



