డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సోమవారం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో లాంచీపై ప్రయాణించి, వచ్చే ఏడాది జరుగబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లని సమీక్షించారు. ఈ సందర్భంగా గోదావరిలో పరిశ్రమల వ్యర్ధాలు కలుస్తుండటంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ని నిలదీశారు.
ఆయన సంజాయిషీ చెప్పబోతే పరిశ్రమలు, పెట్టుబడులు ముఖ్యమే. కానీ నదీ జలాలు కలుషితం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? రేపు ప్రజలు రోగాల బారిన పడితే ముందు మంత్రిగా మీరే జవాబు చెప్పుకోవాలి కదా?అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు.
పరిశ్రమల జల, వాయు కాలుష్య సమస్య ఈనాటిది కాదు. ఒక్క గోదావరిలోనే కాదు యావత్ దేశంలోని అన్ని నదులు, చివరికి సముద్రం కూడా కాలుష్యం అవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులను ఏరిపారేయగలిగింది. కానీ నదీ జలాల కాలుష్యాన్ని మాత్రం అరికట్టలేకపోయింది.
ఎందువల్లనంటే ఇది రాజకీయ, పారిశ్రామిక, ఆర్ధిక, సామాజిక సమస్యలతో ముడిపడి ఉంది. ఉదాహరణకు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేపట్టబోతే ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు కదా?
అందువల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నది, సముద్ర జలాల కాలుష్య సమస్యకు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కాలుష్య నియంత్రణ మండలి, దానిలో లక్షలు లేదా వేలాది మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ వారందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించలేకపోయారు.
కనుక ఈ కాలుష్యం దేశానికి, ప్రభుత్వానికి, ప్రజలకు పెను సమస్యగా మారితే, ఆ అధికారులకు ఇది అదనపు ఆదాయం సమకూర్చే వనరుగా మారింది.
కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఫార్మా కంపెనీల వలన సముద్ర జలాలు కలుషితమై భారీగా చేపలు చనిపోతున్నాయని, తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఉప్పాడ మత్స్యకారులు గత ఏడాది సెప్టెంబర్లో ధర్నా చేశారు. అప్పుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వంద రోజులలలో వారి సమస్యని పరిష్కరిస్తాన్ని హామీ ఇచ్చారు. వారి సమస్య పరిష్కరించగలిగారో లేదో ఆయనకే తెలుసు.
గోదావరి జల కాలుష్యం సమస్య కూడా తీవ్రమైనదే. అది మంత్రి దుర్గేష్ స్థాయిలో పరిష్కరించగలిగే సమస్య కాదనే చెప్పాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండలి పరిష్కరించలేకపోతున్న ఈ సమస్యని మంత్రి కందుల దుర్గేష్ పరిష్కరించలేరని అర్ధమవుతూనే ఉంది.
మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అంటే ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం భారీ మురుగు శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు చేయగలిగితే ఈ సమస్య పరిష్కారం సాధ్యం. కానీ వాటి ఏర్పాటు, నిర్వహణ ప్రభుత్వానికి, పరిశ్రమలకు కూడా తలకుమించిన భారమే అవుతుంది.
కనుక మురుగుశుద్ధి రంగంలో కూడా భారీగా పెట్టుబడులు ప్రోత్సహించగలిగితే ఈ సమస్య కొంత వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
సొంత పార్టీ మంత్రి ‘దుర్గేష్’ ని నిలదీసిన @PawanKalyan
“పుణ్యం వస్తుందో లేదో తెలియదు… కానీ రోగాలు మాత్రం వస్తాయి”
పుష్కర స్నానం చేసే పరిస్థితి ఇదేనా?@APDeputyCMO @kanduladurgesh pic.twitter.com/C0fpu8wC9A
— M9 NEWS (@M9News_) May 26, 2026




