శుక్రవారం నాడు జరిగిన ఓ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కాసేపు భేటీ అయ్యారన్న వార్త ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. అయితే అది కేవలం ‘మర్యాదపూర్వకంగానే’ అంటూ తాజాగా పవన్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చే ప్రయత్నం చేసారు. నేరుగా చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించని పవన్ కళ్యాణ్, పరోక్షంగా తన ఉద్దేశాన్ని తెలియజెప్పారు.
పబ్లిక్ ఈవెంట్స్ లో టీడీపీ, వైసీపీ నేతలను కలిసినపుడు మర్యాదపూర్వకమైన భావం ఉంటుందని, తనకున్న పొలిటికల్ పరిచయాల నేపధ్యంలో గ్రీట్ చేయడం సర్వసాధారణమని, నిజానికి ఇలాంటి వైఖరి టిడిపి – వైసీపీ అవలంభించకపోవడం వలనే అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడం లేదని ఎద్దేవా చేసారు. ఇదంతా చంద్రబాబుతో జరిగిన భేటీ గురించి ప్రస్తావించారని అర్ధం వచ్చేలా పవన్ ట్వీట్ చేసారు.
అంటే తదుపరి తాను చేయబోయే ప్రసంగాలలో మళ్ళీ చంద్రబాబుపై విరుచుకుపడతానని పరోక్షంగా చెప్పినట్లే! ఈ నెల 26వ తేదీ నుండి మలివిడత పోరాటయాత్ర ప్రారంభం కానున్న నేపధ్యంలో… మరోసారి ఏపీ సర్కార్ పై విమర్శల దాడి చేయడానికి సిద్ధమవుతున్నాననే సంకేతాలను పవన్ ఈ సందర్భంగా పంపించారు. ‘తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే…’ అన్న తీరులో పవన్ కొనసాగుతున్నారని చెప్పవచ్చు.
Don’t misinterpret my politeness. pic.twitter.com/1QOpLTnhPu
— Pawan Kalyan (@PawanKalyan) June 23, 2018



