తెలంగాణ నుంచి అందుకే తన్ని తరిమేశారు అయినా…

Pawan Kalyanజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోమవారం అనకాపల్లి జిల్లాలోని విసన్నపేటలో వైసీపీ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను, కొండలను పరిశీలించారు. ఈ సందర్భంగా వేలాదిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలిరావడంతో విసన్నపేట చాలా కోలాహలంగా మారింది.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఇవన్నీ దళితుల భూములు. ఆ పక్కన సర్వే నంబర్ 47లో భూములు రంగపోలు ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియా కిందకు వస్తాయి. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేస్తున్నారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి సర్వే నంబర్ 590/2 కిందకు వచ్చే ఆ కొండపైకి రోడ్లు, ఓ హెలీప్యాడ్ కూడా నిర్మించుకొన్నారు. అనకాపల్లి పట్టణంలో ఎక్కడ చూసినా ఇరుకు సందులే కానీ ఇక్కడ వీళ్ళ వెంచర్లకి 100 అడుగుల రోడ్లు వేసుకొంటున్నారు.

ADVERTISEMENT

ప్రభుత్వ భూములను కాపాడవలసిన వైసీపీ నాయకులే అడ్డుగోలుగా అందినకాడికి దోచుకొని అక్రమంగా వెంచర్స్ వేసుకొంటున్నారు. ఇదివరకు మన ఏపీకి చెందిన కొందరు రాయకీయ నాయకులు ఇలాగే తెలంగాణలో ప్రభుత్వభూములను కబ్జాలు చేస్తుంటే అక్కడి నుంచి తన్ని తరిమేశారు. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు.

ఓ వైపు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించకపోవడంతో ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. అయినా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఏమీ పట్టదు. వారికి ఉత్తరాంద్ర భూముల మీద తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. విశాఖ రాజధానితో ఉత్తరాంద్ర జిల్లాలని అభివృద్ధి చేస్తామని చెపుతూ అందినకాడికి భూములు దోచుకొంటున్నారు.

అయినా అధికారులు ఎవరూ వారిని ప్రశ్నించడానికి సాహసించలేకపోతున్నారు. కనుక నేను వైసీపీ నేతలు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్న ఈ భూకబ్జాలు వాటిలో వారు వేస్తున్న ఈ అక్రమ వెంచర్స్ గురించి కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను,” అని అన్నారు.

ఇప్పటి వరకు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో అటు రాయలసీమ జిల్లాలలో వైసీపీ నేతలు ఏవిదంగా కొండలు, గుట్టలను పిండి చేస్తూ, వాగులు, వంకలలో ఇసుకను దోచేసుకొని కోట్లు గడిస్తున్నారో సెల్ఫీ ఫోటోల సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు చూపించారు.

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఉత్తరాంద్ర జిల్లాలలో వైసీపీ నేతలు ఏవిదంగా భూకబ్జాలు చేస్తున్నారో మీడియాని తీసుకువెళ్ళి మరీ చూపిస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలెవరూ ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు.

ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై కుట్రపూరితంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ తమ అక్రమాలను, అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు సాక్ష్యాధారాలతో సహా వైసీపీ నేతల అవినీతిని, అక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటే, వైసీపీ నేతలు జంకూగొంకూ లేకుండా వ్యవహరించడం విస్మయం కలిగిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories