పార్టీ వ్యవస్థాపక దినం సంధర్భంగా ఈ నెల 14న గుంటూరులో జనసేన భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగా జనసమీకరణ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో జరుపుతున్నారు. ఈ వేదికపై నుండే పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు కార్యాచరణ, పొత్తులు, 2019లో పోటీ చేసే స్థానాల సంఖ్య చెప్పబోతుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటిదాకా ఆయన టీడీపీకి కొంచెం అనుకూలంగా అనిపించినా ఆ పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్, పవన్ కల్యాణలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్టే విపక్షనేత జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం తేదిని ముందుకు జరిపారు.
అదే సమయంలో టీడీపీ కేంద్రప్రభుత్వం నుండి తన మంత్రులను ఉపసంహరించినా జగన్ పార్టీ పెట్టే అవిశ్వాసానికి మద్దత్తు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. బీజేపీతో జతకలిసే అవకాశం ఎలాగూ లేకపోవడంతో ఆయన ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆశ్చర్యకరంగా ఉంది. హోరాహోరీగా జరిగే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పార్టీకి పడే ఓట్లు కూడా కీలకంగా పరిణమించబోతున్నాయి. ఆయన నిర్ణయం బట్టి ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.



