దక్షిణాదిపై ఉత్తర భారతం వర్గాల ఆధిపత్యం ఏంటి? అంటూ రాజకీయాల్లోకి వస్తూనే విరుచుకుపడిన ట్రాక్ రికార్డ్ ‘జనసేన’ అధినేత సొంతం. అయితే అప్పటికే ఈ విధమైన పొలిటికల్ వర్గాలతో పాటు ప్రజల్లోనూ బలంగా ఉండడంతో, పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత దక్కాయి. అంతేకాదు, రాజకీయాల్లోకి ఓ స్పష్టమైన అవగాహనతో పవన్ వచ్చారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అలా ప్రారంభమైన పవన్ రాజకీయ ప్రస్థానం, ప్రస్తుతం ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం అయ్యింది.
తెరవెనుక ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం ఉత్తర భారతం – దక్షిణ భారతం అన్న విమర్శలు పవన్ నోట రావడం లేదు. అందుకు బదులుగా రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి సరికొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. ‘వెనుకబాటుతనం’ పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్న తీరుతో, పవన్ గ్రాఫ్ బాగా పడిపోతోంది. ఏళ్ళ తరబడి రాజకీయాల్లో పాతుకుపోయిన నేతలు నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్న ఉద్దేశంతోనే, ప్రజలు సరికొత్త మార్పును కోరుకుంటున్నారు.
ఆ సరికొత్త మార్పుకు తాను వేదిక అవుతానని ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్, పాత నాయకుల కంటే దారుణమైన రీతిలో రాజకీయాలు చేస్తుండడం శోచనీయం. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రం విడిపోయినపుడు తాను 11 రోజులు భోజనం చేయలేదని సింపతీ పొందిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏ దృష్టితో విభజనవాదాన్ని తెరపైకి తెస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. అంతా “పై వాడు” ఆడిస్తున్న మాయా? లేక “నమో” నారాయణ మహిమో? ఆయనకే తెలియాలి?!



