జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పు చూపించి వైసీపీ నేతల చెంప పగలగడతానని హెచ్చరించడాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు తప్పు పట్టడంపై జనసేన నేతలు, కార్యకర్తలు ధీటుగా స్పందిస్తున్నారు. ఆనాడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ‘రాజకీయ నాయకుడు ఎవరైనా మాట తప్పితే జనాలు చెప్పులు, చీపుర్లు చూపించి నిలదీయాలని, అప్పుడే వారికి ప్రజలంటే భయం ఉంటుందని’ మాటలనే ఇప్పుడు జనసేన నేతలు గుర్తుచేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దాని కింద అమరావతి, ప్రత్యేక హోదా తదితర అంశాలపై మాట మార్చిన మీకు చెప్పు చూపితే తప్పేమిటి?ఆనాడు చెప్పు చూపమని చెప్పింది మీరే కదా? మరిప్పుడు చెప్పు చూపితే ఎందుకు కోపం?అని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులతో సమస్యలు, గుంతలు పడిన రోడ్లు వంటి సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇటువంటి సమస్యలు సృష్టిస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో మూడు రాజధానులు-వికేంద్రీకరణ-విశాఖరాజధాని పేరుతో వైసీపీ నేతలు విశాఖ గర్జన పేరుతో ఆడిన డ్రామా, తమ అధినేత పవన్ కళ్యాణ్‌ని నిర్బందించడం అన్ని కూడా సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అని జనసేన ప్రకాశం జిల్లా ఇన్ ఛార్జ్ షేక్ రియాజ్, తెలంగాణ ఇన్ ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అర్హం ఖాన్ అన్నారు.
తన పెళ్ళిళ్ళపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తే, దానిని సిఎం జగన్మోహన్ రెడ్డి వక్రీకరించి రాష్ట్ర ప్రజలను కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. నిజానికి వైసీపీ నేతలలో చాలామంది రసికులున్నారనే సంగతి అందరికీ తెలుసని, అందుకే వారు ఒక్క పెళ్ళి చేసుకొని 30 స్టెఫీనీలు మెయింటెయిన్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారని జనసేన నేతలు గుర్తు చేశారు.
వైసీపీ 175 సీట్లు గెలుచుకొంటుందని బల్ల గుద్దివాదిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తక్షణం శాసనసభని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు జరపాలని జనసేన నేతలు సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలే తమకి అమరావతి కావాలో మూడు రాజధానులు కావాలో తేల్చుకొంటారని అన్నారు.



