పవన్ అనే నేను…..

mla-pawan-kalyan

గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపి అభ్యర్ధి వంగా గీతపై ఏకంగా 69,169 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం దాదాపు రెండు నెలలుగా రేయింబవళ్ళు కష్టపడిన జనసైనికులు, వీరాభిమానులు పిఠాపురంలో టపాకాయలు కాల్చి పండగ చేసుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు స్వీట్లు పంచుకొని పండుగ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

జగన్మోహన్‌ రెడ్డిలాగా పవన్‌ కళ్యాణ్‌ ‘అహం బ్రహ్మాస్మి’ అని అనుకోకుండా అందరినీ కలుపుతూ, అందరితో కలిసి ముందుకు సాగారు.

ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో కూడా తెలుసని సీట్ల సర్దుబాట్ల సమయంలో నిరూపించుకున్నారు. ఆ సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం జంకాకుండా నిబ్బరంగా నిలబడి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా తనకు తెలుసని నిరూపించుకున్నారు.

ఈసారి తాను గెలవడమే కాకుండా తనతో పాటు 20 మందిని ఎమ్మెల్యేలుగా, మరో ఇద్దరిని ఎంపీలుగా గెలిపించుకుంటున్నారు.

ఈ పదేళ్ళ రాజకీయాలలో అనేక ఎదురుదెబ్బలు, తప్పటడుగులు వేశారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో జగన్‌, మంత్రులు చేసే అవమానాలు, వేధింపులను ఎదుర్కొని పవన్‌ కళ్యాణ్‌ చాలా నిబ్బరంగా నిలబడి పోరాడుతూనే ఉన్నారు.

ముఖ్యంగా టిడిపి, బీజేపీలతో కలిసి, వాటినీ కలపడం, కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా ఈసారి కూటమికి ప్రభంజనం సృష్టించడంలో చాలా తోడ్పడ్డారని చెప్పవచ్చు.

జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ అవహేళన చేస్తుండటం, పోసాని, ముద్రగడ పద్మనాభం వంటివారితో ఆయనను తిట్టించడం, పిఠాపురంలో ఆయనను ఓడించడానికి చేసిన కుట్రలు, కుతంత్రాలు, బ్లేడ్ బ్యాచ్‌లను రంగంలో దింపడం వంటివన్నీ స్థానికులలో ముఖ్యంగా యువత, కాపులకు ఆగ్రహం కలిగించాయని చెప్పవచ్చు. అందుకే ఈసారి అందరూ కూడబలుక్కున్నట్లు పవన్‌ కళ్యాణ్‌కే ఓట్లు వేసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు.

పవన్‌ కళ్యాణ్‌ గెలుపులో టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ పాత్ర ఎంతైనా ఉంది. ఆయన తానే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లుగా భావిస్తూ తన అనుచరులతో కలిసి రేయింబవళ్ళు చాలా కష్టపడ్డారు.

ఇలా అన్నీ కలిసి రావడంతో పవన్‌ కళ్యాణ్‌ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టి “పవన్‌ కళ్యాణ్‌ అనే నేను… “ అంటూ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ దృశ్యం చూడాలని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఇన్నేళ్ళుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్ళకు వారి కోరిక నెరవేరింది.

ADVERTISEMENT
Latest Stories