హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైన ఐఫా వేడుకలు ఘనంగా ముగిసాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవంలో తెలుగు సినీ పరిశ్రమతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన హేమాహేమీలంతా భాగస్వామ్యులయ్యారు. ముఖ్యంగా ఎడమొహం పెడమొహంగా ఉండే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒక వేదికపైకి రావడం సినీ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.
ఇంత ఆనందదాయకమైన వేళలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటనలు అందరి చేత మరింత నవ్వుల పువ్వులను పూయిస్తున్నాయి. “తానూ మంత్రిగా ఉన్న సమయంలోనే ఐఫాను దక్షిణాదికి ఆహ్వానించాను, హైదరాబాద్ కు ఐఫా తరలి రావడం పట్ల సంతోషంగా ఉంది…” అంటూ పరోక్షంగా తన వల్లనే ఐఫా వేడుకలు హైదరాబాద్ లో జరుగుతున్నట్లుగా చేసిన ప్రకటనలు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
కాంగ్రెస్ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన మెగాస్టార్ చిరంజీవి సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదు. తెలుగు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించిన చిరు, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నపుడు బీచ్ ఫెస్టివల్ పేరుతో ఆటలు తప్ప ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చేసిందేమీ లేదన్నది బహిరంగ వాస్తవమే. తానేమీ చేయలేదన్న విషయం మెగాస్టార్ కు కూడా తెలుసు. అందుకనే ఎప్పుడూ ‘అభివృద్ధి’ అనే అంశాన్ని చిరు ప్రస్తావించరు.
కానీ, ఐఫా వేడుకలు బ్రహ్మాండంగా జరగడంతో ఈ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనే దృక్పథంతో బహుశా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా చిరులో ఆ ‘అవకాశవాదం’ పోలేదన్నది పరిశీలకుల భావన. ‘ప్రజారాజ్యం’తో ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ ‘అభయ హస్తం’తో ఒడిసి పట్టుకున్న మెగాస్టార్, ఆ తర్వాత మంత్రుల జాబితాలో చేరిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో అయితే ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి కాంగ్రెస్ అధిష్టానానికి తన విధేయతను చూపించాలని ఊవ్విళ్ళూరినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎటువంటి అవకాశాలు లభించినా అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారని మెగాస్టార్ పై పడుతున్న సైటైర్లకు కొదవలేదు.



