cbi_ys_bhaskar_reddy

వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. కానీ నేటికీ ఆ కేసు విచారణ పూర్తికానే లేదు. ఆయన కుమార్తె సునీతా రెడ్డి పట్టుబట్టి ఆ కేసు విచారణని తెలంగాణ హైకోర్టుకి మార్పించగలిగారు కానీ తనకు మించి మరేమీ జరుగలేదనే చెప్పాలి.

ఈ కేసులో భాస్కర్ రెడ్డితో సహా చాలా మంది అరెస్ట్ అయ్యారు కదా? అంటే అవును. వారు అరెస్ట్ అవడం బెయిల్ తీసుకొని బయటకు వచ్చేయడం జరిగిపోయింది కదా?

Also Read – కేసీఆర్‌ చరిత్రని రేవంత్ తుడిచేయగలరా?

కనుక ఈ హత్య కేసులో దోషులు ఎవరో నిర్ధారించి వారికి శిక్షలు వేయాల్సిన ఈ సమయంలో కూడా ఇంకా వారి బెయిల్ పిటిషన్లు, వాటి రద్దు పిటిషన్లపైనే విచారణలు సాగుతుండటం గమనిస్తే, ఈ లెక్కన ఈ కేసు విచారణ ఎప్పటికీ పూర్తయ్యేను.. వివేకా హంతకులకు శిక్షలు ఎప్పుడు పడేను?అని సామాన్య ప్రజలకు సందేహం కలుగకమానదు.

జగన్‌ ఆక్రమాస్తుల కేసుల విచారణ అప్పుడే మొదటి పుష్కరం పూర్తిచేసుకొని విజయవంతంగా రెండో పుష్కరంలోకి ప్రవేశించాయి. వివేకా హత్య కేసు విచారణలు సాగుతున్న తీరు చూస్తున్నప్పుడు ఈ కేసు కూడా రెండు, మూడు పుష్కరాలు సాగుతుందేమో?అని అనిపించక మానదు.

Also Read – విదేశాలకు రేషన్ బియ్యం రవాణా ఏవిదంగా అంటే..

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ కేసు విచారణని గత ఏడాది జూలై నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టులోనే, ఇప్పుడు భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఆయనకు కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు నోటీస్ పంపింది.

అంటే భూమి గుండ్రంగా ఉన్నట్లు వివేకా హత్య కేసు ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే చేరుకుందన్న మాట! ఎలాగో చూద్దాం.. ఆయన మళ్ళీ కౌంటర్ వేస్తారు. ఆయన వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించకపోతే మళ్ళీ జైలుకి పంపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ వేస్తారు. దానిపై హైకోర్టు విచారణ జరిపినప్పుడు షరా మామూలుగానే సీబీఐ అభ్యంతరం చెపుతుంది.

Also Read – మేము రోడ్లపై జగన్‌ ప్యాలస్‌లోనా.. ఎందుకు ?

సీబీఐ మాట కొట్టేయలేక అప్పటికి బెయిల్ పిటిషన్ తిరస్కరించినా కొన్ని వాయిదాల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తుంది. అప్పుడు సీబీఐ మళ్ళీ ఇలాగే సుప్రీంకోర్టుకి వచ్చి ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ వేస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఆయనకు నోటీస్ పంపిస్తుంది.

కనుక ఈ కేసు సైకిల్ చక్రంలా అక్కడే తిరుగుతుంటుందన్న మాట! ఈ మద్యలో రాజకీయాలు ఏమైనా మారితే కొన్నేళ్ళు ఈ కేసులు మళ్ళీ అటక మీద విశ్రాంతి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.




కనుక వివేకా హత్య కేసు విచారణలు ఎప్పటికీ ఇలాగే పూలనావలా సాగిపోతూనే ఉంటాయని భావించవచ్చు. పుష్కరాల పాటు సాగిపోయే ఇటువంటి కేసుల కోసం ప్రత్యేకంగా చట్టాలు, కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో?