
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి కూటమి ప్రభుత్వం చకచకా సన్నాహాలు చేస్తుంటే రాయలసీమ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని అంటూ జగన్ 5 ఏళ్ళపాటు ఊరించారే తప్ప దాని ఏర్పాటుకి చిన్న చర్య కూడా చేపట్టలేదు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4-5 నెలలకే బెంచ్ ఏర్పాటుకి సన్నాహాలు ప్రారంభించింది. అప్పుడే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అందుబాటులో ఉన్న భవనాల వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేసింది కూడా. కనుక మరో 4-5 నెలల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Also Read – వైసీపీ నేతలు బిజీ బిజీ… ఒకరు బయటికి మరొకరు లోపలికి!
సరిగ్గా ఇటువంటి సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టులో ఓ పిటిషన్ పడింది. తాండవ యోగేష్, తురాగా సాయిసూర్య అనే ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పినందున, అమరావతిలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టుని విభజించి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కనుక బెంచ్ ఏర్పాటు ప్రక్రియని నిలిపివేయాలని పిటీషనర్లు కోరిన్నట్లు సమాచారం.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుని రాయలసీమలో న్యాయవాదులు అందరూ స్వాగతిస్తుంటే, వద్దని వాదించే వారి వెనుక ఎవరుంటారు? అసలు బెంచ్ వద్దని ఎందుకంటున్నారు? అని ఆలోచిస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే ఆ క్రెడిట్ సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. తమకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనుకునేవారు ఎవరై ఉంటారు?అని ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది.
Also Read – త్రిభాషా…డీలిమిటేషన్ పై పవన్ స్పందన…
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి సిద్దం అవుతున్న హైకోర్టులోనే బెంచ్ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిల కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి, హైకోర్టు బెంచ్ ఏర్పాటులో సుప్రీంకోర్టు 2000 లో ఇచ్చిన తీర్పుని అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేపడతామని తెలియజేస్తూ ఈ కేసుని రెండు వారాలకు వాయిదా వేసింది.