“ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా అవినీతికి రావులేకుండా…” అనే మాటను మన సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరి నోట నిత్యం వినబడుతూనే ఉంటుంది. అయితే రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెపుతున్నారు.
ఆయన నిన్న రాజమండ్రీలో మీడియాతో మాట్లాడుతూ, “ధాన్యం కొనుగోలులో ఆంధ్రప్రదేశ్‌లో భారీ కుంభకోణం జరుగుతోంది. రైస్ మిల్లర్లు, కొందరు అధికారులు కలిసి రైతుల ఆధార్ కార్డులు లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారు.
ఏకంగా 17,000 మంది రైతుల ఆధార్ లింక్ అవలేదంటే ఈ కుంభకోణం ఏ స్థాయిలో జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కుంభకోణానికి సంబందించి నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను స్వయంగా కోనసీమ జిల్లా కలెక్టర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేయబోతున్నాను,” అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికి తావు లేకుండా చాలా పారదర్శకమైన పాలన సాగిస్తున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటుంటే, వైసీపీలో అత్యంత సీనియర్, ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో జరుగుతున్న భారీ కుంభకోణాన్ని బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి బయటపెట్టడం చాలా సంచలనం సృష్టిస్తోంది.
ఆ 17,000 మంది రైతులు కోనసీమ జిల్లాకు చెందినవారే అయితే ఇక మిగిలిన 25 జిల్లాలలో ఇంకెంతమంది రైతులు మోసపోతున్నారో ఎవరూ ఊహించలేరు. పిల్లి సుభాష్ బయటపెట్టిన ఈ కుంభకోణం వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. కనుక రాష్ట్రాన్ని అవినీతి రహితంగా పాలిస్తున్నానని చెప్పుకొనే సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం కలగవచ్చు. అప్పుడు పిల్లితో సహా అందరి నోళ్ళకు తాళం వేయవచ్చు.



