వైసీపీలో సీనియర్ నాయకులలో పిల్లి శుభాష్ చంద్రబోస్ ఒకరు. జగన్ కష్టకాలంలో వెన్నంటి ఉంటూ వైసీపీని కాపాడుకొన్నవారిలో ఆయన కూడా ఒకరు. అయితే కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాల్ కృష్ణకు, ఆయనకు మద్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు బోస్‌ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని గట్టిగా అక్షింతలు వేసిన్నట్లు సమాచారం.
పార్టీలో అందరి కంటే సీనియర్ అయిన మీరే ఈవిదంగా టికెట్ కోసం జిల్లా మంత్రితో గొడవపడుతుండటం ఏమిటని గట్టిగా నిలదీసిన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బోస్ మొన్న‘జగన్ సురక్ష’ కార్యక్రమంలో మంత్రి ఎదుటే ఆయన అనుచరుడు ఉదయ్ తన అనుచరుడు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై చెయ్యి చేసుకొన్న సంగతిని వివరించబోగా జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. అసలు ఒకరిని ఒకరు తిట్టుకొని, కొట్టుకొనే వరకు గొడవలు జరగడం బోస్ తప్పిదమే అని అన్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన రామచంద్రాపురం నుంచి తనను మండపేట పంపించి ఆ సీటుని వేణుగోపాల్ కృష్ణకు ఇచ్చిన విషయాన్ని బోస్ జగన్‌కు గుర్తుచేసి, అందుకే ఆ సీటును తన కుమారుడు సూర్యప్రకాష్‌కు ఇవ్వాలని కోరుకొంటున్నానని నచ్చజెప్పబోయారు.
కానీ దాంతో జగన్ ఆయనపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. “మీ కుమారుడికి సీటు కావాలంటే నన్ను అడగాలి కానీ జిల్లా మంత్రితో గొడవ పెట్టుకోవడం దేనికి? దాని వలన పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసా లేదా?” అని గట్టిగా నిలదీసిన్నట్లు తెలుస్తోంది.
అయితే తన మాటలకు బోస్ చిన్న బుచ్చుకోవడంతో జగన్ మళ్ళీ ఆయనను బుజ్జగిస్తూ “సూర్యప్రకాష్‌ను ఎక్కడ నుంచి పోటీ చేయించాలో నాకు వదిలేసి మీరు నిశ్చింతగా పనిచేసుకోండి,” అని హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
కొడుకుకి టికెట్ లభిస్తుందనే హామీ దొరికింది కానీ ముఖ్యమంత్రి చేత చివాట్లు తినడం, ఇకపై మంత్రి వేణుగోపాల కృష్ణ ముందు తలదించుకోవలసిరావడం, తన వ్యతిరేక వర్గం అనే సూటిపోటి మాటలు భరించాల్సి రావడం పిల్లి శుభాష్ చంద్రబోస్‌కు చాలా కష్టమే. కానీ వైసీపీలో ఉండాలనుకొంటే ఈ అవమానాలు భరించక తప్పదు. మరి భరిస్తూ వైసీపీలోనే ఉంటారో పార్టీ మారుతారో చూడాలి.



