జగన్ తన చేతిలో ఉన్న అధికారాన్ని, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం పై బలంగా గొంతెత్తిన ప్రతిపక్ష నేతల పైన, వైసీపీ నేతల చేతులో దాడులకు గురైన బాధితుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపించారు. అయితే వారిలో కొందరికి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారనుకోండి.
అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. పోలింగ్ రోజు ఈవీఎంలను ధ్వంసం చేసి, టీడీపీ ఏజెంట్ల మీద దాడులకు పాల్పడిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై చర్యలు తీసుకుంది న్యాయస్థానం. దాని ఫలితంగా పిన్నెల్లి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.
పిన్నెల్లి చేసిన రాజ్యాంగ వ్యతిరేఖ చర్యను తప్పుపటాల్సిన పార్టీ అధినేత జగన్ ఇప్పుడు పిన్నేల్లి చర్యలను సమర్థిస్తూ ఆయనను ఓదార్చడానికి నెల్లూరు జైలుకు వెళ్లారు. పార్టీ పరంగా పిన్నేల్లికి అన్ని రకాలుగా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చి ఇటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు జగన్.
అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన అరాచకాలకు సరైన శిక్ష పడితే ఇక జగన్ ఈ ఐదేళ్లు తమ పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికీ, ఓదార్చడానికి జైలు యాత్రలు చేస్తూ కళ్ళు మూసుకోవాల్సిందే. ఇప్పటికే గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ నాయకులు చేసిన దాడికి సంబంధించిన కేసును తిరిగి బయటకు తీస్తున్నారు అధికారాలు.
ఈ కేసు తాలూకా విచారణ మళ్ళీ మొదలుపెట్టడంతో అధికారులు ఒక్కొక్కరి పై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న విజయవాడ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తన తప్పేం లేకపోతే అవినాష్ ఎందుకు పారిపోయినట్లో వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆధారాలు బట్టి చూస్తే టీడీపీ కార్యాలయ ధ్వంసంలో వైసీపీ ముఖ్యనాయకుల హస్తం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇవన్నీ రుజువైతే మరికొంతమంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయంగా కనపడుతుంది. అలాగే పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో వైసీపీ నేత ద్వారం పూడికి కూడా తన అక్రమార్జనకు సంబంధించిన అన్ని ద్వారాలు మూసేస్తున్నారు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. దీనితో అతి త్వరలోనే ద్వారం పూడికి జైలు ద్వారాలు తెరుచుకోనున్నాయి.
ఇక రోజా, కొడాలి నాని, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వారివారి శాఖలలో చేసిన దోపిడీకి అంతే లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో మారిన మద్యం బ్రాండ్లతో వెనకేసుకున్న నోట్ల కట్టలు, ఇసుక, మైనింగ్ పేరుతో పోగేసుకున్న అక్రమ సంపాదనను అన్ని ఆధారాలతో బయట పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఈసారి జగన్ జైలు యాత్రలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తన సలహాదారుల సలహా తీసుకోవాల్సిందే అంటున్నారు టీడీపీ శ్రేణులు.




