ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రాజకీయాలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరుకున్నాయి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారాయి అనేది గ్రహించవచ్చు.
గతంలో తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే, అన్న డీఎంకే ల మధ్య జరిగే నువ్వా నేనా అనే రాజకీయ సమరం గత ఐదేళ్లు ఏపీలో వైసీపీ, టీడీపీ ల మధ్య జరిగాయి. అలాగే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య సాగుతున్నాయి.
నాడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంస్కృతిని దిగుమతి చేసి పెంచి పెద్ద చేసింది. అధికారం చేతిలో ఉంటే చాలు ఇక చట్టాలతో పని లేదు అనేలా గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, పార్టీ పరంగా వైసీపీ అనుసరించిన విధానాలు ‘న భూతో నా భవిష్యతి’ అనేలా సాగాయి.
రాజకీయాలలోకి కుటుంబాలను లాగి, వ్యక్తిగత విమర్శలను మొదలు పెట్టి, మహిళలను కించపరిచే విధానాలతో వైసీపీ నడిపిన రాజకీయం ముందు అనుభవం తలవంచింది, సహనం చేతులు కట్టుకుంది. ‘బూతులే’ మా రాజకీయ సిద్ధాంతం, ‘దాడులే’ మా ప్రభుత్వ ఎజెండా అన్నట్టుగా గత ఐదేళ్లు ఏపీలో పాలన చేసింది వైసీపీ.
ఇక ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైనప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోవడం లేదు. అవే అసత్యపు వార్తలు, విద్వేషకర పోస్టులు పెట్టుకుంటూ పార్టీల మధ్య ఉండే రాజకీయ వైరాన్ని వ్యక్తిగత ద్వేషంగా మార్చేస్తున్నారు వైసీపీ నేతలు. గతంలో బాబుకి ప్రతిపక్ష నేత అనే విలువ ఇవ్వలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అనే గౌరవం ఇవ్వలేకపోతున్నారు.
ఇప్పుడు ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య కూడా ఇదే తరహా రాజకీయం నడుస్తుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్ని విమర్శలు ఎదుర్కొని కూడా ఇంకా బతికున్నావా.? అనేంత దారుణమైన వ్యాఖ్యలు చేయాల్సిన సందర్భాలు ఎందుకొచ్చాయి.?
ప్రజలు చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని కూలిపోతుంది అని శాపాలు పెట్టడం, కూలతోస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం.? అలాగే ఒక ప్రతిపక్ష నేతను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ కూడా అమర్యాదగా మాట్లాడడం హేతుబద్దమైన చర్య అనిపించుకోదు.
రాజకీయ పార్టీల మధ్య ఉండే సిద్ధాంతపరమైన విబేధాలను ఇలా వ్యక్తిగత ద్వేషాలుగా మార్చుకుని భవిష్యత్ రాజకీయాన్ని కలుషితం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అధికారంలో ఉన్నన్నాళ్ళు అహంకారంతో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నారు, అధికారం చేజారగానే విచక్షణ మరిచి కళ్ళు తెరవలేకపోతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా తెలుగు దేశం అధినేతను విమర్శించే వారు, అలాగే టీడీపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విధానాల పై ఆ పార్టీ లీడర్ గా వైస్సార్ ను తప్పుబట్టేవారు బాబు. ఒక్కసారి రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరి మధ్య ఉండే అన్యోన్యత రాజకీయాలలో ఉండే ఫ్రెండ్లీ వాతావరణానికి అద్దం పట్టేది.
కానీ ఇప్పుడా పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కనిపించడం లేదు. వైసీపీ ఆవిర్భవంతోనే ఏపీలో ఈ సంస్కృతీ సమాధి చేయబడింది. ఇక ఈ వైసీపీ గాలి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను తాకినట్టుంది. రేవంత్, కేటీఆర్ మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శలు చూస్తే ఇవి రాజకీయ హద్దులను చెరిపేసినట్టుగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితులలో వీరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గున మండిపోయేలా ఉంది. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కునే నాయకులను ఇక ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడలేరా.? రాజకీయానికి – వ్యక్తిగతానికి మధ్య ఉన్న ఆ చిన్న అంతరాన్ని ఇక రాజకీయ పార్టీలు గుర్తించలేవా.?






