ప్రజలు అవినీతి, అసమర్ధతని పట్టించుకోవడం మానేశారా?

Political family feuds and public silence

రాజకీయాలలో వారసత్వ సమస్య ఈనాటిది కాదు. యుగయుగాల నుంచి ఉంది. ఈ కలియుగంలో అది ఇంకా తీవ్రమైంది.

ఆస్తుల కోసం జగన్‌-షర్మిల, పదవుల కోసం కేటీఆర్‌-కవిత మద్య కొట్లాడుకుని విడిపోయారు. అలాగే ఆస్తుల కోసం తల్లీ-కొడుకులు, పదవులు, అధికారం కోసం తండ్రీ-కూతుర్లు కూడా విడిపోతారని విజయమ్మ-జగన్‌, కేసీఆర్‌-కవితలు నిరూపించి చూపుతున్నారు.

ADVERTISEMENT

సరే! ఇవన్నీ వారి కుటుంబం, పార్టీ వ్యవహారాలు గనుక వాటిలో ఇతరులు జోక్యం చేసుకోలేరు. కానీ ఇలా వివిధ కారణాలతో విభేదించుకున్నవారు, మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే వారు తమ పంచాయితీలను ప్రజల ముందు చర్చకు పెట్టిన్నట్లే భావించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రజలు లేదా ప్రత్యర్ధులు తమ అభిప్రాయలు వ్యక్తం చేసినా వారు తప్పుపట్టకూడదు.

ఉదాహరణకు ఇక్కడ ఏపీలో జగన్‌పై షర్మిల, అక్కడ తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులపై కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కనుక ఆయా పార్టీల నేతలతో ప్రతివిమర్శలు చేయిస్తున్నారు.

ఈ విమర్శలు, ప్రతివిమర్శలు, ఈ ఆరోపణలు ప్రత్యారోపనలతో తామందరం దుష్టులు, అవినీతిపరులు, మోసగాళ్ళని వారంతటవారే బయటపెట్టుకుంటున్నారు. తాము ఇలాంటివారిమని వారే స్వయంగా చెప్పుకుంటున్నా కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు వారినే అంటిపెట్టుకొని తిరుగడం రాజకీయ అనివార్యం.

కానీ ప్రజలు కూడా అటువంటి వారిని గుడ్డిగా సమర్ధిస్తుండటమే ఆలోచింపజేస్తుంది. తాము అవినీతి, అక్రమాలకూ పాల్పడ్డామని ప్రజలకు బాగా తెలిసి ఉన్నా కూడా తమనే గుడ్డిగా నమ్ముతున్నారు. తమకే జేజేలు పలుకుతున్నారు. కనుకనే వారు నాయకులుగా చలామణి కాగలుగుతున్నారు. ప్రభుత్వాలను, పోలీసులను అవహేళన చేస్తున్నారు.

వారికి ఇంత ధైర్యం కల్పించింది ప్రజలేనని స్పష్టమవుతోంది. అంతేకాదు… నాయకుల అవినీతి, అక్రమాలు, అసమర్దతని కూడా ప్రజలు పట్టించుకోవడం మానేశారు!

ఒకప్పుడు రాక్షసులు ఘోర తపస్సులు చేస్తే దేవుళ్ళు ప్రత్యక్షమయ్యి వారు రాక్షసులు అని తెలిసి ఉన్నా అడిగిన వరాలన్నీ ఇచ్చేసేవారు. అదే విధంగా ఇప్పుడు ప్రజలు కూడా అవినీతిపరులని నెత్తినపెట్టుకొని అందలం ఎక్కిస్తున్నప్పుడు వారు అవినీతికి పాల్పడకుండా ఉంటారా?

రాక్షసులకు వరాలు ఇవ్వడంలో ఓ లాజిక్ ఉంటుంది. అదంతా శ్రీమహావిష్ణువు స్క్రీన్ ప్లేలో భాగమేనని రాక్షస సంహారం జరిగినప్పుడు అర్ధమవుతుంది. మన రాజకీయాలలో కూడా అలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది కానీ ఎన్నడూ రాక్షస సంహారం జరుగదు. ఒకవేళ జరిగినా రావణాసురుడి తలల్లా రాక్షసులు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటారు. ఆ రాక్షసులకు జై కొడితే ప్రజలు కూడా ఆ రాక్షాస జాతిలో చేరినట్లే కదా?

ADVERTISEMENT
Latest Stories