అదానీ-మోడీల బంధం రహాస్యమేమీ కాదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అదానీ గ్రూప్ శరవేగంగా తన సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరించుకున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో చేరారు.
అందుకు ఆయన ఎంచుకున్న మార్గాలలో అవినీతి ఉందని అమెరికా కోర్టు చెపితే తప్ప భారతీయులకు తెలియదనుకోలేము. కానీ అమెరికా సంస్థలు చెప్పినప్పటి నుంచే ఆయన అవినీతిపరుడు అని తెలిసిన్నట్లు అందరూ నటించేస్తున్నారు.
గతంలో అదానీతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వస్తే అదేదో తమ నగ్న చిత్రం బయటకు వచ్చిన్నట్లు రాజకీయ నాయకులు భయపడుతున్నారు. దీనినే ప్రతిపక్షాలు అవకాశంగా మలుచుకొని ప్రధాని, ముఖ్యమంత్రుల పేర్లు అదానీతో ముడిపెడుతూ ప్రజల దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అంటే అదానీ అవినీతిపరుడని నొక్కి చెప్పి, ఆయన అవినీతి భాగోతాల గురించి మాట్లాడే బదులు, అదానీ పేరుతో తమ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీయాలనే తాపత్రయమే ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుండటం విశేషం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు మూడు వారాలకే దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ గౌతం అదానీతో భేటీ అయ్యి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అప్పుడు ఆయనతో కలిసి ఫోటోలు దిగి, ‘పెట్టుబడుల సాధనకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారంటూ’ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి నిన్న రాజ్ భవన్ ఎదుట అదానీ అవినీతిపై విచారణ జరపాలని ధర్నా చేయడం విశేషం.
అదానీతో రేవంత్ రెడ్డి పేరుని ముడిపెట్టి ప్రజల దృష్టిలో అవినీతిపరుడుగా నిలబెట్టి రాజకీయంగా దెబ్బ తీయలని బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కనుకనే రేవంత్ రెడ్డి తదితరులు నిన్న రాజ్ భవన్ ఎదుట ధర్నా చేసి, బీజేపితో అదానీకి, బిఆర్ఎస్ పార్టీకి బలమైన సంబంధం ఉందని నిరూపించే ప్రయత్నం చేసిన్నట్లు భావించవచ్చు.
ఈవిదంగా ఎవరు మాట్లాడినా వారికీ ఈ ‘అదానీ బురద’ అంటుకునే అవకాశం ఉంది కనుక ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ మౌనం వహిస్తున్నాయని అనుకోవచ్చు.




