అదానీ నీడ పడినా ఉలిక్కిపడుతున్నారే!

Gautam Adani

ఒకప్పుడు అందరూ ఆయనతో పోటీలు పడి ఫోటోలు దిగినవారే. ఆయనని పెట్టుబడులు పెట్టమని బ్రతిమాలినవారే. కానీ ఇప్పుడు ఆయనతో తమ పాత ఫోటో బయటపడినా భయపడుతున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఆయనతో తమకు ఎటువంటి సంబందమూ లేదని చెపుతున్నారు. తమ ప్రత్యర్ధులే ఆయనతో అంటకాగారని నిరూపించే సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నారు. ఆయన ఎవరో కాదు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.

అమెరికా కోర్టులో ఆయన బృందంపై కేసు నమోదు కాగానే దేశంలో ప్రతీ రాజకీయ నాయకుడు ఇప్పుడు చేస్తున్నదిదే.

ADVERTISEMENT

అదనీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే కేసీఆర్‌ ‘నో’ చెప్పారని, కానీ రేవంత్ రెడ్డి అదానీతో అంటకాగుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కానీ కేసీఆర్‌ హయాంలోనే అదానీ గ్రూప్‌ని తెలంగాణలోకి ఆహ్వానించిన విషయం మర్నాడే బయటపడింది. కనుక కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ నేతలు పరస్పరం ఒకరిపై మరొకరు అదానీ అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు.

అదానీ గ్రూప్ రూ.8,240 కోట్లు పెట్టుబడితో కడప, అన్నమ్మయ్య జిల్లాలలో ‘ఆస్తా గ్రీన్ ఎనర్జీ’ పేరుతో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు అమెరికా కోర్టు కేసు, జగన్‌-అదానీ రూ.1750 కోట్ల అవినీతి భాగోతం బయటపడగానే అందరూ ఉలిక్కి పడ్డారు.

ముందుగా జగన్‌ స్పందిస్తూ అసలు అదానీతో విద్యుత్ కొనుగోలుకి ఒప్పందాలే చేసుకోలేదని, ఇక అవినీతి ఎలా జరుగుతుందని బుకాయించే ప్రయత్నం చేశారు. పైగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే అదానీ గ్రూప్‌తో చేసుకున్న వాణిజ్య, పరిశ్రమల స్థాపనకు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని సవాల్ కూడా విసిరారు. ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అదానీ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అదానీతో వ్యవహరం అంటే పులి మీద సవారీ చేయడం వంటిదేనని, ఒకసారి దాని మీద కూర్చుంటే ఇక ఎన్నటికీ దిగలేమని, దిగితే చాలా ప్రమాదమని అందరి కంటే బాగా జగన్‌, షర్మిలకి బాగా తెలుసు.

కానీ వారిద్దరూ ఇప్పుడు అధికారంలో లేరు కనుక ఏమైనా డిమాండ్ చేయవచ్చు. కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అదానీతో ఉండే ఇటువంటి సమస్యలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకునే ఏ నిర్ణయమైన తీసుకోవలసి ఉంటుంది. అందుకే తొందరపడటం లేదు.

ADVERTISEMENT
Latest Stories